చండీగఢ్ : హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖత్తార్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత కుల్‌దీప్ బిష్ణోయ్ భేటీ కావడం అనేక ఊహాగానాలకు తెరలేచింది. హర్యానా కాంగ్రెస్ కమిటీలో తనకు సముచిత స్థానం దక్కకపోవడంతో కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను విడిచిపెట్టే మరో సీనియర్ నేత కుల్‌దీప్ అన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయ. 53 ఏళ్ల బిష్ణోయ్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుమారుడు. బిష్ణోయ్ బుధవారం సాయంత్రం గురుగ్రామ్‌లో ఖత్తార్‌తో సమావేశమయ్యారు. తన అదంపూర్ నియోజక వర్గం లోని రాజకీయ సమస్యలపైన, ఇతర అంశాల పైన తాను ఖత్తార్‌తో చర్చించినట్టు బిష్ణోయ్ తన ట్వీట్‌లో వెల్లడించారు. అదంపూర్ గ్రామ పంచాయతీ పునరుద్ధరణకు సంబంధించి తన అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి ఆమోదించారని, తన సమక్షం లోనే ఆదేశాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
గత నెలలో హర్యానా పీసీసీ అధ్యక్షునిగా ఉదయభాన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. దీంతో బిష్ణోయ్ వర్గం తీవ్ర ఆగ్రహం చెందింది. ఈ విషయంలో తాను కూడా అసంతృప్తిగా ఉన్నానని, అయితే సహనం పాటించాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. జాట్‌యేతర కీలక నేత అయిన బిష్ణోయ్ ప్రజల మద్దతుగల యువనేతలకు అవకాశం ఇవ్వాలని పార్టీని పటిష్టం చేయాలని గతంలో కాంగ్రెస్ పెద్దలను గట్టిగా కోరారు. అయితే మాజీ ఎంపీ కూడా అయిన అయన 2007 లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి, సొంతంగా హర్యానా జనహిత్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు. బీజేపీతో కొంతకాలం పొత్తు పెట్టుకున్నారు. కానీ 2014 శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీకి దూరమయ్యారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్‌లో మళ్లీ చేరారు.