చండీగఢ్ : పంజాబ్‌లో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ఉనికిలో లేని ఒక శాఖకు పంజాబ్‌లో ఒక మంత్రి సుమారు 20 నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. దీనిని సవరించేందుకు పంజాబ్ ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లో 2022 మార్చిలో భగవంత్ మాన్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంఏర్పడింది. మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంలో 2023 మే నెలలో కుల్దీప్ సింగ్ ధలివాల్‌కు రెండు శాఖలు కేటాయించారు. ఒకటి ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు, రెండవది పరిపాలన సంస్కరణల శాఖ. 2024 చివరలో మరొకసారి మంత్రివర్గ పునర్వవస్థీకరణ జరిగింది. ఆ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
అయితే, దీనిని ప్రభుత్వం తాజాగా సవరించింది, కుల్దీప్ సింగ్‌కు కేటాయించిన పరిపాలన సంస్కరణల శాఖ ఉనికిలో లేకపోవడం వల్ల సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం అందులో తెలియజేసింది. లేని శాఖకు కుల్దీప్ సింగ్ మంత్రిగా ఉన్న వ్యవహారంపై బిజెపి విమర్శలు గుప్పించింది. పంజాబ్‌లో పాలనను ఆమ్ ఆద్మీ ప్రభుత్వం జోక్‌గా మార్చివేసిందని బిజెపి విమర్శించింది. ఉనికిలో లేని శాఖకు మంత్రిగా 20 నెలలు ఉండడం విడ్డూరమని బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది. లేని శాఖను ఒక మంత్రి నిర్వహిస్తున్నారనేది ముఖ్యమంత్రికి తెలియదంటే పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని బిజెపి విమర్శించింది.