Thursday, January 23, 2025

వ్యవసాయ శాఖపై కుమారస్వామి కన్ను

- Advertisement -
- Advertisement -

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ శాఖపై తమ పార్టీ ఆసక్తితో ఉందని జెడి (ఎస్) నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి బుధవారం సూచనప్రాయంగా తెలియజేశారు. బిజెపి, జెడి (ఎస్) 28 సీట్లు ఉన్న కర్నాటకలో లోక్‌సభ ఎన్నికల్లో కలసి పోటీ చేశాయి. బిజెపి 17 సీట్లు గెలుపొందగా, జెడి (ఎస్)కు రెండు సీట్లు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు జెడి (ఎస్) డిమాండ్లు ఏమిటన్న ప్రశ్నకు కుమారస్వామి సమాధానం ఇస్తూ, ‘మాకు అటువంటి డిమాండ్ ఏదీ లేదు. కేంద్రం వద్ద దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కర్నాటకకు సంబంధించిన సమస్యల పరిష్కారమే మాకు ప్రధానం. కేంద్రంలో కర్నాటకకు ప్రాతినిధ్యం (మంత్రివర్గంలో స్థానం) ఇచ్చిన తరువాత నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకుంటారు’ అని చెప్పారు.

తన మంత్రి పదవి ఆకాంక్షలపై ప్రశ్నకు ఎన్‌డిఎ నాయకత్వం నిర్ణయిస్తుందని కుమారస్వామి సమాధానం ఇచ్చారు. ‘సమయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. (కర్నాటకలో) పరిస్థితికి అవసరమైన నిర్ణయం ఏమిటో ఢిల్లీ నేతలకు తెలుసు. వారు నిర్ణయిస్తారు’ అని ఆయన తెలిపారు. తాను వ్యవసాయ శాఖ మంత్రి కాగలనని కొన్ని వర్గాల్లో సాగుతున్న ఊహాగానాల గురించి కుమారస్వామి ప్రస్తావిస్తూ, తన పార్టీకి వ్యవసాయ శాఖపై ఆసక్తి ఉందని అంగీకరించారు. ‘ఏ నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం’ అని ఆయన అన్నారు. ‘మా పార్టీ ఆసక్తి వ్యవసాయ శాఖపైనే. రైతు లోకానికి మేలు చేసే దిశగానే మొదటి నుంచి మా పోరు సాగుతోంది’ అని కుమారస్వామి చెప్పారు. ఎన్‌డిఎ సమావేశం కోసం బుధవారం న్యూఢిల్లీకి వచ్చిన కుమారస్వామి విలేకరులతో మాట్లాడారు. కుమారస్వామి భారీ మెజారిటీతో మాండ్య లోక్‌సభ సీటు గెలుచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News