Monday, January 20, 2025

తిరిగి సొంత గూటికి కుంభం..?

- Advertisement -
- Advertisement -

తిరిగి సొంత గూటికి కుంభం..?
హైదరాబాద్ లోని కుంభం నివాసంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ

మళ్లీ కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం

హైదరాబాద్ లోని బిఆర్ఎస్ నేత కుంభం నివాసానికి చేరుకున్న అభిమానులు కార్యకర్తలు

యాదాద్రి భువనగిరి: అసెంబ్లీ ఎన్నికల వేళ భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిన కుంభం అనీల్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారా?, బీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీ టికెట్‌ ఆశించిన ఆయన తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కుంభం అనీల్ కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించక పోవడమే కాకుండా, సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రావడం, ఆయనతో కుంభం అనీల్ కుమార్ రెడ్డి సమావేశం కావడం, ఆయన అభిమానులు భువనగిరి నుంచి కుంభం నివాసానికి చేరుకోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో విబేధాల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అనీల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి జూలై 24న బిఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, బిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కుంభం అనీల్ కుమార్ రెడ్డికి సీఎం కేసీఆర్‌ తనకు భువనగిరి నియోజకవర్గంలో మంచి అవకాశం కల్పించి ఉన్నత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారని క్యాంపు కార్యాలయానికి వచ్చిన సమయంలో ఆయన కార్యకర్తలకు వివరించారు.

ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో భువనగిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికీ మరోసారి అవకాశం కల్పించినట్లు ప్రకటించడంతో ఎమ్మెల్యేగా గెలువాలనే తన కోరిక నేరవేరుతలేదని, కనీసం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి తనకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని, గత కొన్ని సంవత్సరాలుగా భువనగిరి ఎమ్మెల్యేగా గెలువాలనీ అంతా సిద్ధం చేసుకున్నా.. ఇటీవల జిట్టా బాలకృష్ణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో భువనగిరి నియోజకవర్గం అనే రాశి(వడ్ల కుప్ప)పై ఎవరో వచ్చి కూర్చుంటామంటే చూస్తూ ఊరుకుంటామా? అనే సామేతకు అనుకూలంగా తాను కచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటానంటూ కార్యకర్తలతో తమ ఆవేదన వెలిబుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయనకు బిఆర్ఎస్ పార్టీలో మంచి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన చూపు కాంగ్రెస్ పై పడిందనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. కాగా, కుంభం అనీల్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు టీపీసీసీ మాత్రం సుముఖంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి తీరుతో అర్థమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News