Monday, December 23, 2024

వికృత మేళాగా మిగిలిన కుంభమేళా!

- Advertisement -
- Advertisement -

ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి మన భారతదేశంలో కుంభమేళా జరుగుతుంది. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో గంగా మధ్యప్రదేశ్ ఉజ్జయినీ లో సిప్రా మహారాష్ట్ర నాసిక్‌లో గోదావరి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో గంగా, యమునల సంగమంలో కుంభమేళా జరుగుతుంది. అయితే, అది తన మూల ఉద్దేశాన్ని మరిచిపోయి, మూఢ నమ్మకాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఈ నాలుగు ప్రదేశాల్లో లక్షల జనం అక్కడి నదుల్లో స్నానాలు చేస్తుంటారు. తమ పాపాలు కడిగివేయ బడతాయనీ, తమకు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయనీ, భవిష్యత్తులో తమకు, తమ కుటుంబానికి అంతా మంచే జరుగుతుందనీ ఆశపడుతుంటారు. ఆశ పడడంలో తప్పు లేదు గాని మంచి జరుగుతుందన్న దానికి ఆధారాలు లేవు. కుంభమేళా శతాబ్దాలుగా కొనసాగుతున్నా ఆధారాలు మాత్రం ఇప్పటికీ కనిపించడం లేదు.

కాలమెంత గడిచినా, అంధ విశ్వాసాలకు ఆధారాలు దొరకవు కదా? నదీ జలాల్ని కలుషితం చేసి, లక్షల మంది నీటిలో మునుగుతున్నందు వల్ల తప్పక అంటువ్యాధులు వ్యాపిస్తాయి తప్ప, ఒనగూరే మంచి అంటూ ఏదీ వుండదు. అసలు ఈ కుంభమేళాకు మూలాలు ఎక్కడ? అది ఎలా ప్రారంభమైంది? కాలక్రమంలో మార్పులు చేర్పులతో, వక్రీకరణలతో అంధ విశ్వాసాలకు ఎలా ఆలవాలమైందీ? తెలుసుకోవాలంటే సాధారణ శకం ఏడవ శతాబ్దంలోకి వెళ్ళాలి. ఆ కాలంలో ఉత్తర భారత దేశాన్ని ఏక రాజ్యాధికారంలోకి తెచ్చిన చక్రవర్తి హర్షుడి గూర్చి తెలుసుకోవాలి. ఆయన “దాన వీరుడి”గా ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడో.. తెలుసుకోవాలి!

చక్రవర్తి హర్షుడి పేరు మనకు కొత్తమీ కాదు. చరిత్ర పాఠాల్లో చదువుకున్నదే! సాధారణ శకం 590647 మధ్య జీవించిన వాడు. 606 నుండి 647 వరకు పరిపాలించిన వాడు. ఒక వైపు యుద్ధాలు చేస్తూ సామ్రాజ్యాన్ని విస్తరించడంలోను, ప్రజలను శాంతియుతంగా పరిపాలించడంలోనూ ఆయన తనకు తానే సాటి అని అనిపించుకున్నవాడు. కుంభమేళా ఈ బౌద్ధ చక్రవర్తి హర్షుడు రూపొందించుకున్న సంప్రదాయం. దాన్ని ధ్వంసం చేసి వైదికులు మరో రకంగా ప్రచారం చేశారు. హర్షుడికి ‘శిలాదిత్య’ అనే బిరుదు వుండేది. ఏడవ శతాబ్దంలో భారత దేశంలో పర్యటించిన చీనీ యాత్రికుడు హ్యూన్‌త్సాంగ్ రచనల్లో విషయాలు స్పష్టంగా వున్నాయి. ఆయన రచనకు తర్వాత కాలంలో హిందీ అనువాదం కూడా అందుబాటులో కొచ్చింది. అందువల్ల ఏ మాత్రం అనుమానం లేకుండా, మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. బౌద్ధ వారసత్వాన్ని నాశనం చేసి కుట్ర పూరితంగా కుంభమేళ ఆశయాన్ని భ్రష్టు పట్టించారు. అందుకు బలం చేకూర్చడానికి కల్పిత కథలు, అభూత కల్పనలూ జోడించారు. హర్షుడికి యుద్ధ వీరుడిగా ఎంత పేరుందో దాన వీరుడిగా అంతకన్నా ఎక్కువ పేరుంది. దయార్ద్ర హృదయుడు కాబట్టే ప్రజలు ఆయనను కోరుకుని రాజును చేశారు. తమ ప్రియ బాంధవుడిగా భావించారు. ఆ రోజుల్లో ఆయన చేపట్టిన దాన ధర్మాలకు ఇప్పుడు మనం చూస్తున్న కుంభమేళాకు కొంత సంబంధముంది. ఇప్పుడు మనం చూస్తున్నది వైదిక ధర్మ ప్రబోధకులు వికృతంగా తయారు చేసిన మేళా! హర్షుడు ప్రారంభించినపుడు దాని ఉద్దేశం వేరు.

హర్షుడి రాజధాని కనౌజ్ (ఉత్తరప్రదేశ్). ఆయన త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడి నుండి అందరికీ దానాలు చేసేవాడు. ఆయన ఇచ్చే దానాలు స్వీకరించాలని జనం దూర దూర ప్రాంతాల నుండి తరలి వచ్చేవారు. ఆ ప్రదేశాన్ని ‘మహాదాన భూమి’ అని అనేవారు. మొదటి రోజు ఆయన బుద్ధుడి విగ్రహాన్ని కడిగి, వైభవోపేతంగా పూలతో అలంకరించే వాడు. తరువాత స్థానికంగా వున్న భిక్షులను, మేధావులను, పండితులను గౌరవించి వారికి కానుకలు ఇచ్చి సాగనంపేవాడు. నలంద, తక్షిశిల, విశ్వవిద్యాలయ అధ్యాపకుల్ని సత్కరించి కానుకలిచ్చేవాడు. ఆ తర్వాత ఇతర మతాలు పాటించే వారిని కూడా పిలిచి, మర్యాద పూర్వకంగా కానుకలు సమర్పించే వాడు.

తరువాత వరుసలో విధవరాండ్రు, దుఃఖితులు, దరిద్రులు, రోగులు, అంగవైకల్యం వున్నవారు, ప్రార్థనా స్థలాల్లో పని చేసే మహంతులు, పాండాలు, పూజారుల వంటి వారికందరికీ వరుసగా దానాలు చేసేవాడు. తన చేతి వేళ్ళకు వున్న వుంగరాలు, మెడలోని రత్నాల హారాలు మొదలైన వాటిని కూడా దానం చేసేవాడు. అలా చేస్తున్నప్పుడు ఆయనకు విచారంగా, బాధగా వుండేది కాదు. ఎంతో సంతృప్తిగా వుండేది. అలా చేస్తున్నందుకు అమితానందం పొందేవాడు. తన కోశాగారంలోని ధనరాశులు, ప్రజలకు పంచి పెట్టడం జరుగుతూ వుండేది. మహాదాన భూమిలో ఈ కార్యక్రమమంతా పూర్తి చేసుకొని చక్రవర్తి శిలాదిత్య ఇలా అనేవాడు “నా దగ్గరున్నదంతా ప్రజా కోశాగారానికి చేరింది. ఒక మహోపకార్యానికి ఉపయోగపడింది. అక్కడ అది దుర్వినియోగం కావడానికి ఆస్కారం లేదు. ప్రజాధనం ప్రజలకు చేరిందంటే అంతకన్నా సార్థకత ఏముంది?” అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేవాడు. ఇలాంటి విషయాలన్నీ హ్యూన్‌త్సాంగ్ నోట్స్ వల్ల తెలుస్తున్నాయి.

హర్ష చక్రవర్తి దాన గుణం ఏ స్థాయిలో వుండేదో తెలుసుకోవడానికి ప్రచారంలో వున్న ఒక కథను పరిశీలిద్దాం ఒకసారి ఆయన త్రివేణి సంగమం చేరుకొని మహాదాన భూమి నుండి దానాలు చేశాడు. వంటి మీది ఆభరణాలు, చేతి వుంగరాలు పైన వున్న వస్త్రాలు అన్నీ దానం చేశాడు. మొలకు ధోవతి తప్ప ఏమీ మిగలలేదు. అప్పుడు ఒకడు వచ్చి ‘రాజా’ అని చేయి చాపాడు. అప్పుడు ఇక ఏం చేయాలో తోచక, హర్షుడు పక్కన వున్న మహిళను అభ్యర్థించి ఓ కండువా తీసుకున్నాడు. ఆ కండువా తను చుట్టుకొని, తన విలువైన ధోవతిని ఆ చేయి చాపి నిలుచున్న వాడికి అందించాడు. ఒంటి మీద వున్న గుడ్డలతో సహా ఆయన ప్రజలకు దానం చేసే వాడని ఆ కథ చెపుతుంది. దాని ఆధారంగా వైదిక ప్రబోధకులు నగ్న సన్యాసుల్ని, నాగబాబాల్ని, అఘోరాల్ని కుంభమేళాలో చేర్చారు. ఉన్నదంతా ప్రజలకు, సమాజానికి దానమివ్వాలని శిలాదిత్య హర్ష చక్రవర్తి చెపితే, దాన్ని కుంభమేళాగా మార్చి నీటిలో మునిగితే చాలు సర్వపాప హరణ జరుగుతుందని మనువాదులు ఊదరగొట్టారు. ఎక్కడా ఏమీ లేని దిగంబర సన్యాసులు ఈ సమాజానికి ఏమివ్వగలరూ? ఏ రకంగా ఆదర్శప్రాయులు కాగలరూ? ఆలోచించే పని లేదా? హర్షుడు ప్రారంభించిన ఆ సంప్రదాయం ఆయన తర్వాత కూడా కొంత కాలం కొనసాగింది. జమీందారులు, ధనవంతులు కొందరు ఆ మహాదాన భూమికి వచ్చి, నదీ స్నానాలు చేసి తమ దగ్గరున్న ధనం, బంగారం దానం చేసి వెళ్లేవారు. కాలక్రమంలో దానాలు ఆగిపోయి ఉట్టి స్నానాలు మిగిలాయి.

చక్రవర్తి శిలాదిత్య తన కోశాగారంలో వున్నదంతా సమాజానికి, వివిధ వర్గాల వారికి దానం చేశాడే గాని, గుడ్డలిప్పి నగ్నంగా ఊరేగలేదు. ఊరేగాలనీ చెప్పలేదు. నదీ స్నానాలు వల్ల పుణ్యం వస్తుందని గాని, పాపాలు పోతాయని గాని, కొర్కెలు తీరతాయని గాని హర్షుడు తన ప్రజలకు చెప్పలేదు. బౌద్ధ స్థూపం కట్టించి, బౌద్ధ జీవన విధానానికి ప్రాముఖ్యమివ్వాలని చెప్పకనే చెప్పాడు. అదే సమయంలో ఇతర మతస్థుల్ని కూడా సమానంగా ఆదరించాడు. కుల, మత, లింగ, ప్రాంత భేదాలు వుండకూడదని, అందరూ కలిసి మెలిసి వుండాలని ఆయన భావించాడు. నదీ స్నానం పేరుతో అందరినీ ఒక్కచోట చేర్చి, ఒక్కటిగా చూడాలని అనుకొన్నాడు. తన నుండి దానం స్వీకరించడానికి దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి భోజన సదుపాయం కల్పించేవాడు. రాజు అంటే తండ్రి లాంటి వాడని ఆయనకు తె లుసు. అందుకే ప్రజలెవరూ ఆకలికి అలమటించకుండా ఆ మహా మానవ సమూహానికి అన్నం పెట్టే బాధ్యత హర్షుడే తీసుకునేవాడు. ఉన్నవన్నీ ఇతరుల కోసం త్యజించి, సమాజానికి మహోపకారం చేయడమన్నది బౌద్ధ చక్రవర్తి ఇచ్చిన సందేశం. అయితే ఇవ్వడానికి ఏమీ లేని సన్యాసులంతా నగ్నంగా తిరుగుతూ కుంభమేళాకు వక్రభాష్యం చెప్పారు. ఇదంతా 8వ శతాబ్దపు వాడైన శంకరాచార్య ఘనత! బహుశా ఆయన సమాజానికి అందించిన మహా ప్రసాదం అదే!

వీరశైవుల దేవుడు శంకరుడు. ఒంటి నిండా బూడిద పూసుకొని, మొలకు చిన్న జంతు చర్మం చుట్టుకొని వుండేవాడు. ఆయనను అనుసరించే ఈ ఆధునిక శంకరులు విభూతి, బూడిద పూసుకున్నారే గాని, చిన్న గోచీ అయినా పెట్టుకోలేకపోయారు. సమకాలీనంలో మనమేం చూస్తున్నాం? వేల సంఖ్యలో సన్యాసులు వీధుల వెంట నగ్నంగా అనాగరికంగా తిరుగుతూ వుంటే అదేదో పుణ్య కార్యమైనట్టు కొందరు వ్యాఖ్యానాలు చేస్తుంటారు. నాగరిక సమాజాన్ని అపహాస్యం చేస్తూ అంత మంది నగ్నంగా వీధుల్లో నడుస్తూ వుంటే ప్రభుత్వాలు ఇప్పటికీ చర్యలు తీసుకోవు. మూఢ భక్తులు వంగి వంగి దండాలు పెడుతుంటారు. అలా చేయడం వల్ల ఇటు భక్తులకు గాని, అటు నగ్న స్వాములకు గాని, ఏమీ రాదు. వచ్చేది ఏదైనా వుంటే సామాన్య ప్రజలకు విపులంగా వివరించాలి. నిరూపించాలి. అధికారంలో వున్న రాజకీయ ప్రముఖులు కోట్ల విలువ గల సూట్లు వేసుకొని తిరుగుతుంటారు. కాని, నైతికత, జీవన విలువలు అనే వలువలు వదిలేసి నగ్నంగానే తిరుగుతున్నారు.
మేధావులు మౌనం వహించినపుడు
మూర్ఖుల సంఖ్య రెట్టింపవుతుంది.
ఇది ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం!
అని అన్నారు నెల్సన్ మండేలా.

( ఈ 2023లో 6 జనవరి నుండి 18 ఫిబ్రవరి మధ్య 45 రోజుల పాటు మాఘ కుంభమేళా ప్రయాగలో జరిగింది. )

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News