త్రివేణి సంగమంలో ఆధ్యాత్మిక పరవళ్లు
కృత్రిమ మేధ, డేగ కళ్ల భద్రత
నడుమ ప్రయాగ్‌రాజ్
45రోజుల పాటు పవిత్రస్నానాలు
ఆచరించనున్న భక్తులు
144ఏళ్లకు ఒకసారి వచ్చే
మహా కుంభమేళాకు ఈసారి
354౦ కోట్ల మంది
తరలివచ్చే అవకాశం
ప్రయాగ్‌రాజ్ (యుపి) : ఒకే చోట అతిపెద్ద జనసందోహంగా పరిగణించే 45 రోజుల ఉత్సవం ‘కుంభమేళా’ (మహా కుంభ్ 2025) సోమవారం ప్రారంభం కాబోతున్నది. ‘పౌష్ పూర్ణిమ’ శుభ సందర్భంలో ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం ‘త్రివేణి సంగమం’లో తొలి ప్రధాన స్నాన ప్రక్రియ లేదా ‘షహీ స్నాన్’తో కుంభమేళా మొదలవుతుంది. 12 సంవత్సరాల తరువాత ప్రస్తుత కుంభ మేళా జరగనుండడం ఈ సందర్భాన్ని మరింత శుభప్రదం చేస్తున్నది.
ఈ పర్యాయం 35 కోట్ల మంది యాత్రికులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శిస్తారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బహుశా అందుకే దృఢ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇందుకు సూచిక అన్నట్లు లాంఛనంగా ఈ ఉత్సవం ప్రారంభానికి రెండు రోజుల ముందు శనివారం రికార్డు స్థాయిలో 25 లక్షల మంది ప్రజలు పుణ్య స్నానం ఆచరించారు, ‘ఈ పర్యాయం ఇది మహా కుంభ మేళా కానున్నది. దైవత్వం, ఆధ్యాత్మికతతోత పాటు ఆధునికత కూడా చోటు చేసుకోబోతున్నది. ఈమారు కృత్రిమ మేధ (ఎఐ)ను భారీ ఎత్తున ఉపయోగిస్తుండడంతో ఇది ‘డిజికుంభ్’ కాబోతున్నది’ అని అధికారులు పేర్కొన్నారు. ఈ మహా ఉత్సవం కోసం ప్రయాగ్‌రాజ్ నగరంలో సర్వం సిద్ధం చేశారు. ప్రపంచం అంతటి నుంచి సాధువులు, స్వాములు, యాత్రికులు, ప్రజానీకానికి స్వాగతం పలికేందుకు నగరం సిద్ధమైంది.
వారిలో అనేక మంది ఇప్పటికే వచ్చారు. సోమవారం (13) నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించనున్న కుంభ మేళా భారత ప్రాచీన సాంస్కృతి, మతపరమైన సంప్రదాయాలను ప్రపంచ ప్రాముఖ్య స్థాయికి తీసుకువెళుతుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్‌లో ఒక పర్యటన సమయంలో చెప్పారు. ఈ ఉత్సవాన్ని భారత సుసంపన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఆదిత్యనాథ్ అభివర్ణిస్తూ, ‘తమ ప్రాచీన సంప్రదాయాలు, సాంస్కృతిక మూలాలతో తిరిగి అనుబంధం ఏర్పరచుకునే అవకాశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కుంభ మేళా కల్పిస్తుంది. తాజా కుంభ మేళా ఘనమైన, దైవిక, డిజిటల్‌గా ఆధునిక వేడుక’ అని అన్నారు. ‘పది వేల ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ ఉత్సవం పరిశుభ్రతకు, భద్రతకు, ఆధునికతకు ఒక విశిష్ట ప్రమాణాన్ని నెలకొల్పుతుంది.
భక్తులకు సౌకర్యం పెంపుదలకు డిజిటల్ టూరిస్ట్ మ్యాప్ మరుగుదొడ్ల పరిశుభ్రత పర్యవేక్షణకు వీలు కల్పిస్తుంది. ఇక స్మార్ట్‌ఫోన్లతో సమీకృతమైన ఎఐ ఆధారిత భద్రత వ్యవస్థ భద్రత చేకూరేలా చేస్తుంది’ అని ముఖ్యమంత్రి వివరించారు. కుంభ మేళా కేవలం ఒక మతపర కార్యక్రమం కాదని, సామాజిక, ఆధ్యాత్మిక సమైక్యతకుచిహ్నం కూడా అని ఆయన చెప్పారు. ‘ఈ ఉత్సవం (మహాకుంభ్ నగర్)ను ప్రపంచంలో అత్యంత పెద్ద తాత్కాలిక నగరంగా మారుస్తుంది, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి మంది వరకు భక్తులకు వసతి కల్పిస్తుంది’ అని ఆదిత్యనాథ్ తెలిపారు. కుంభ మేళా కోసం 45 వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరించడంతో పాటు 55 పైచిలుకు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఏ దుశ్చర్యా జరగకుండా చూసేందుకు సామాజిక మాధ్యమాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రాజెక్టులను కూడా మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. వివిధ వర్గాలకు చెందిన సాధువులతో 13 అఖాడాలు కుంభ మేళాలో పాల్గొంటున్నాయి.
ప్రయాగ్‌రాజ్‌లో వివిధ కార్యాలయాల గోడలపై హిందు మతం, దేవుళ్లు, దేవతలకు సంబంధించిన వివిధ అంశాలు, మత గ్రంథాల్లో ప్రస్తావించిన ప్రముఖ కార్యక్రమాలను సూచించే చిత్రాలతో అలంకరించారు. నగరంలోని కూడళ్లను కూడా ఆధునికంగా తీర్చిదిద్దారు. కలశం, శంఖం, సూర్య నమస్కారానికి సంబంధించిన వివిధ ఆసనాలు వంటి రకరకాల మత వస్తువులతో వాటన్నిటినీ అలంకరించారు. జన సందోహం నియంత్రణ కోసం వివిధ కూడళ్లు, ముక్కోణ కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. నదుల సంగమ ప్రదేశాల్లో ఒక చోట నుంచి మరొక చోటకు ప్రజల రవాణాకు వీలుగా సంగమ ప్రాంతంలోను, ఫాఫమౌలోను 30 బల్లకట్లు సిద్ధం చేశారు. ఈ పుణ్య క్షేత్రంలోకి భక్తులను స్వాగతించేందుకు ప్రవేశ ప్రదేశాలు కొన్నిటి వద్ద భారీ గేట్లు కూడా అమర్చారు. 2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ‘ప్రాణ ప్రతిష్ఠ’ తరువాత తొలి కుంభ్ అవుతున్న దృష్టా ఈ దఫా కుంభ మేళా ప్రత్యేక ప్రాముఖ్యం సంతరించుకుంటున్నది.