ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి మన భారత దేశంలో కుంభమేళా జరుగుతుంది. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో గంగా మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో సిప్రా మహారాష్ట్ర నాసిక్‌లో గోదావరి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునల సంగమంలో కుంభమేళా జరుగుతుంది. ఈ నాలుగు ప్రదేశాల్లో లక్షల జనం అక్కడి నదుల్లో స్నానాలు చేస్తుంటారు. తమ పాపాలు కడిగివేయబడతాయనీ, తమకు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయనీ, భవిష్యత్తులో తమకు, తమ కుటుంబానికీ అంతా మంచే జరుగుతుందనీ ఆశపడుతుంటారు. ఆశ పడడంలో తప్పు లేదు గాని మంచి జరుగుతుందన్న దానికి ఆధారాలు లేవు. కుంభమేళా శతాబ్దాలుగా కొనసాగుతున్నా ఆధారాలు మాత్రం ఇప్పటికీ కనిపించడం లేదు.
అసలు ఈ కుంభమేళాకు మూలాలు ఎక్కడ? అది ఎలా ప్రారంభమైంది? కాలక్రమంలో మార్పులు చేర్పులతో, వక్రీకరణలతో అంధ విశ్వాసాలకు ఎలా ఆలవాలమైందీ? తెలుసుకోవాలంటే సాధారణ శకం ఏడవ శతాబ్దంలోకి వెళ్లాలి. ఆ కాలంలో ఉత్తర భారత దేశాన్ని ఏక రాజ్యాధికారంలోకి తెచ్చిన చక్రవర్తి హర్షుడి గూర్చి తెలుసుకోవాలి. ఆయన “దాన వీరుడు”గా ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడో.. తెలుసుకోవాలి! చక్రవర్తి హర్షుడి పేరు మనకు కొత్తేమీ కాదు. చరిత్ర పాఠాల్లో చదువుకున్నదే !సాధారణ శకం 590 647 మధ్య జీవించినవాడు. 606 నుండి 647 వరకు పరిపాలించినవాడు. ఒకవైపు యుద్ధాలు చేస్తూ సామ్రాజ్యాన్ని విస్తరించడంలోను, ప్రజలను శాంతియుతంగా పరిపాలించడంలోనూ ఆయన తనకు తానే సాటి అని అనిపించుకున్నవాడు. కుంభమేళా ఈ బౌద్ధ చక్రవర్తి హర్షుడు రూపొందించుకున్న సంప్రదాయం.
హర్షుడికి ‘శిలాదిత్య’ అనే బిరుడు ఉండేది. ఏడవ శతాబ్దంలో భారతదేశంలో పర్యటించిన చీనీ యాత్రికుడు హ్యూన్‌త్సాంగ్ రచనల్లో విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఆయన రచనకు తర్వాత కాలంలో హిందీ అనువాదం కూడా అందుబాటులో కొచ్చింది. అందువల్ల ఏమాత్రం అనుమానం లేకుండా, మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. హర్షుడికి యుద్ధ వీరుడిగా ఎంత పేరుందో దాన వీరుడిగా అంతకన్నా ఎక్కువ పేరుంది. దయార్ద్ర హృదయుడు కాబట్టే, ప్రజలు ఆయనను కోరుకుని రాజును చేశారు. తమ ప్రియ బాంధవుడిగా భావించారు. ఆ రోజుల్లో ఆయన చేపట్టిన దానధర్మాలను ఇప్పుడు మనం చేస్తున్న కుంభమేళాకు కొంత సంబంధముంది. ఇప్పుడు మనం చూస్తున్నది వైదిక ధర్మప్రబోధకులు తయారు చేసిన మేళా! హర్షుడు ప్రారంభించినప్పుడు దాని ఉద్దేశం వేరు.
హర్షుడి రాజధాని కనౌజ్ (ఉత్తరప్రదేశ్). ఆయన త్రివేణి సంగమానికి వెళ్లి, అక్కడి నుండి అందరికీ దానాలు చేసేవాడు. ఆయన ఇచ్చే దానాలు స్వీకరించాలని జనం దూరదూర ప్రాంతాల నుండి తరలివచ్చేవారు. ఆ ప్రదేశాన్ని ‘మహాదానభూమి’ అని అనేవారు. మొదటి రోజు ఆయన బుద్ధుడి విగ్రహాన్ని కడిగి వైభవోపేతంగా పూలతో అలంకరించేవాడు. తరువాత స్థానికంగా ఉన్న భిక్షులను, మేధావులను, పండితులను గౌరవించి వారికి కానుకలు ఇచ్చి సాగనంపేవాడు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయ అధ్యాపకుల్ని సత్కరించి కానుకలిచ్చేవాడు. ఆ తర్వాత ఇతర మతాలు పాటించేవారిని కూడా పిలిచి, మర్యాద పూర్వకంగా కానుకలు సమర్పించేవాడు. తరువాత వరుసలో విధవరాండ్రు, దుఃఖితులు, దరిద్రులు, రోగులు, అంగవైకల్యం ఉన్నవారు. ప్రార్థనా స్థలాల్లో పని చేసే మహంతులు, పాండాలు, పూజారుల వంటి వారికందరికీ వరుసగా దానాలు చేసేవాడు. తన చేతి వేళ్లకు ఉన్న ఉంగరాలు, మెడలోని రత్నాల హారాలు మొదలైన వాటిని కూడా దానం చేసేవాడు.
ప్రజాధనం ప్రజలకు చేరిందంటే అంతకన్నా సార్థకత ఏముంది?” అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేవాడు. ఇలాంటి విషయాలన్నీ హ్యూన్‌త్సాంగ్ నోట్స్ వల్ల తెలుస్తున్నాయి. హర్షచక్రవర్తి దానగుణం ఏ స్థాయిలో ఉండేదో తెలుసుకోవడానికి ప్రచారంలో ఉన్న ఒక కథను పరిశీలిద్దాం ఒకసారి ఆయన త్రివేణి సంగమం చేరుకుని మహాదాన భూమి నుండి దానాలు చేశాడు. వంటి మీద ఆభరణాలు, చేతి ఉంగరాలు పైన ఉన్న వస్త్రాలు అన్నీ దానం చేశాడు. మొలకు ధోవతి తప్ప ఏమీ మిగలలేదు. అప్పుడు ఒకడు వచ్చి ‘రాజా’ అని చేయి చాపాడు. అప్పుడు ఇక ఏం చేయాలో తోచక, హర్షుడు పక్కన ఉన్న మహిళను అభ్యర్థించి ఓ కండువా తీసుకున్నాడు. ఆ కండువా తను చుట్టుకుని తన విలువైన ధోవతిని ఆ చేయి చాపి నిలుచున్నవాడికి అందించాడు.
ఒంటి మీద ఉన్న గుడ్డలతో సహా ఆయన ప్రజలకు దానం చేసే వాడని ఆ కథ చెపుతుంది. దాని ఆధారంగా వైదిక ప్రబోధకులు నగ్న సన్యాసుల్ని, నాగ బాబాల్ని, అఘోరాల్ని కుంభమేళాలో చేర్చారు. ఉన్నదంతా ప్రజలకు, సమాజానికి దానమివ్వాలని శిలాదిత్య హర్షచక్రవర్తి చెపితే, దాన్ని కుంభమేళాగా మార్చి నీటిలో మునిగితే చాలు సర్వపాపహరణ జరుగుతుందని ఊదరగొట్టారు. హర్షుడు ప్రారంభించిన ఆ సంప్రదాయం ఆయన తర్వాత కూడా కొంత కాలం కొనసాగింది. జమీందారులు, ధనవంతులు, కొందరు ఆ మహాదాన భూమికి వచ్చి, నదీ స్నానాలు చేసి తమ దగ్గరున్న ధనం, బంగారం దానం చేసి వెళ్లేవారు. కాలక్రమంలో దానాలు ఆగిపోయి ఉట్టి స్నానాలు మిగిలాయి.
చక్రవర్తి శిలాదిత్య తన కోశాగారంలో ఉన్నదంతా సమాజానికి వివిధ వర్గాల వారికి దానం చేశాడే గానీ, నగ్నంగా ఊరేగలేదు. ఊరేగాలనీ చెప్పలేదు. నదీ స్నానాల వల్ల పుణ్యం వస్తుందని గానీ, పాపాలు పోతాయని గానీ, కోర్కెల తీరతాయని గానీ హర్షుడు తన ప్రజలకు చెప్పలేదు. బౌద్ధ స్థూపం కట్టించి, బౌద్ధ జీవన విధానానికి ప్రాముఖ్య మివ్వాలని చెప్పకనే చెప్పాడు. అదే సమయంలో ఇతర మతస్థుల్ని కూడా సమానంగా ఆదరించాడు. కుల, మత, లింగ, ప్రాంత భేదాలు ఉండకూడదని, అందరూ కలిసి మెలిసి ఉండాలని ఆయన భావించాడు. నదీ స్నానం పేరుతో అందరినీ ఒక్కచోట చేర్చి, ఒక్కటిగా చూడాలని అనుకున్నాడు. తన నుండి దానం స్వీకరించడానికి దూరప్రాంతాల నుండి వచ్చిన వారికి భోజన సదుపాయం కల్పించేవాడు. రాజు అంటే తండ్రి లాంటి వాడని ఆయనకు తెలుసు. అందుకే ప్రజలెవరూ ఆకలికి అలమటించకుండా ఆ మహా మానవ సమూహానికి అన్నం పెట్టే బాధ్యత హర్షుడే తీసుకునేవాడు. ఉన్నవన్నీ ఇతరుల కోసం త్యజించి, సమాజానికి మహోపకారం చేయడమన్నది బౌద్ధ చక్రవర్తి ఇచ్చిన సందేశం.
డాక్టర్ దేవరాజు మహారాజు