ముంబై మేయర్ కిషోరీ ఘాటు విమర్శ
ముంబై : కుంభమేళ నుంచి తిరిగొచ్చిన వారు కరోనా ప్రసాద సంతర్పణ గావిస్తారని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) మేయర్ కిశోరీ పెడ్నెకర్ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు కుంభమేళ భక్తులకు ఆగ్రహం తెప్పించి, వివాదాస్పదం అయ్యాయి. శనివారం ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కుంభమేళకు వెళ్లి తిరిగొచ్చిన వారు ఎక్కడికెళ్లినా అక్కడ కరోనా కట్టలు తెంచుకుంటుందని తెలిపారు. తీర్థయాత్రలకు వెళ్లిన వారు తిరిగొచ్చిన తరువాత అందరికీ ప్రసాదం పంచినట్లు ఈ జనం కరోనా వైరస్‌ను ప్రసాదంగా పంపిణీ చేస్తారని , ఇదే ఇప్పటి విడ్డూరం అయిందని తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కుంభమేళలో లక్షలాది మంది కరోనా జంకూగొంకూ లేకుండా స్నానాలు ఆచరించి, క్రతువులు నిర్వర్తించి , తిరుగుముఖం పట్టారు.ముంబైలో కరోనా కేసుల ఉధృతి నడుమ ఈ భక్తుల సంగతిని మేయర్ ప్రస్తావించారు.