Tuesday, February 4, 2025

కుంభమేళా తొక్కిసలాట అంత పెద్ద ఘటన కాదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రయాగ్‌రాజ్ లో మహా కుంభమేళాలో తొక్కిసలాట ‘పెద్ద ఘటన’ కాదని, ‘అతి చేస్తున్నార’ని బిజెపి ఎంపి హేమామాలిని మంగళవారం వ్యాఖ్యానించారు. అక్కడ జనసందోహం విషయంలో ఏర్పాట్లను చాలా బాగా నిర్వహిస్తున్నారని ఆమె తెలిపారు. హిందు క్యాలెండర్ ప్రకారం అత్యంత శుభప్రదమైన రోజుల్లో ఒకటైన మౌని అమావాస్య సందర్భంగా జనవరి 29న తొక్కిసలాట చోటు చేసుకున్నది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద తెల్లవారు జామున తొక్కిసలాటలో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మంది గాయపడ్డారు.

‘నేను కుంభమేళాకు వెళ్లాను& మేము చక్కని స్నానం చేశాం& అంతా పక్కాగా నిర్వహిస్తున్నారు. ఆ ఘటన (తొక్కిసలాట) జరిగిందన్నది నిజమే& అది అంత పెద్ద ఘటన కాదు. అది ఎంత పెద్దదో నాకు తెలియదు. అతిగా ప్రచారం చేస్తున్నారు& చాలా బాగా నిర్వహిస్తున్నారు, అంతా చాలా చక్కగా జరుగుతోంది& అనేక మంది వస్తున్నారు, ఏర్పాట్ల నిర్వహణ చాలా కష్టం కానీ మేము మా శక్తి మేర కృషి చేస్తున్నాం&’ అని హేమామాలిని ఢిల్లీలో పార్లమెంట్ భవన సముదాయంలో విలేకరులతో చెప్పారు. రాజకీయ నాయకురాలిగా మారిన నటి కూడా తొక్కిసలాట రోజు మహా కుంభమేళా సమయంలో పవిత్ర స్నానం చేశారు.

తొక్కిసలాటలో మరణాల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించడం గురించి ప్రశ్నించినప్పుడు ‘వారు తాము అనుకున్నదంతా చెబుతారు,… తప్పుడు విషయాలు మాట్లాడడం వారి పని’ అని హేమామాలిని సమాధానం ఇచ్చారు. కాగా, మహా కుంభమేళాలో తొక్కిసలాట దుర్ఘటన మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిధ్వనించింది. తొక్కిసలాటలో మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) నేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. కుంభమేళా నిర్వహణలో ‘లోటుపాట్లను’ కప్పిపుచ్చుకునే యత్నం చేస్తున్నవారిపై చర్య తీసుకోవాలని ఆయన కోరారు.

ప్రస్తుత కుంభమేళాలో తొక్కిసలాటలో మరణాలు స్వతంత్ర భారతంలోని అత్యంత దుర్ఘటనల్లో ఒకటి అని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) సభ్యుడు సౌగతా రాయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర ప్రతిపక్ష నేతలు సోమవారం పార్లమెంట్‌లో ఈ అంశం ప్రస్తావించి మృతుల జాబితాను వెలువరించాలని కోరారు. మరొక వైపు అధికార బిజెపి తొక్కిసలాట వెనుక ఏదో కుట్ర ఉండవచ్చునని ఆరోపించింది. అందుకు బాధ్యులు ఆ ఘటనపై దర్యాప్తు ముగిసిన తరువాత సిగ్గుతో తమ తల దించుకోవలసి ఉంటుందని బిజెపి అన్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News