Monday, March 10, 2025

కుంభమేళా తొక్కిసలాట దురదృష్టకరం : సుప్రీం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కుంభమేళా తొక్కిసలాట సంఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని సోమవారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ దేశ వ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిల్‌ను తిరస్కరించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. సంగం ఘాట్ వద్ద చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ విశాల్ తివారీ అనే న్యాయవాది ఇటీవల సుప్రీం కోర్టులో పిల్ వేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన విధానపరమైన మార్గదర్శకత్వాలు ఇవ్వాలని అందులో కోరారు. భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల కదలికలను ఆపాలని పిటిషన్‌లో ప్రస్తావించారు. దీనిపై యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ సంఘటనపై జ్యుడీషియల్ దర్యాప్తు జరుగుతోందని, ఇదే తరహాలో ఓ పిల్ హైకోర్టులో దాఖలైందని సుప్రీంకు తెలియజేశారు. ఇరుపక్షాల వాదనల విన్న అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News