Monday, December 23, 2024

కొత్తగూడెం నుంచి కూనంనేని పోటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు పేరును సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సిపిఐ ఈ స్థానం నుండి పోటీ చేస్తున్నది. కొత్తగూడెం అభ్యర్థిగా పోటీ చేయనున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె. నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి లు బి ఫామ్ అందజేశారు.

ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ శాసనసభలో పేదలు, కార్మికులు కర్షకులు సామాన్యుల గొంతును వినిపించేందుకు సిపిఐని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సాంబశివరావు బుధవారం నాడు కొత్తగూడెంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. విశాలాంధ్ర దినపత్రిక విలేఖరిగా కొత్తగూడెంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కూనంనేని సాంబశివరావు ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో హోల్ టైమర్ గా పనిచేస్తున్నారు. 1987లో కొత్తగూడెం మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా విజయం సాధించారు.

2009లో కూనంనేని సాంబశివరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సిపిఐ తరఫున కొత్తగూడెం నియోజకవర్గం నుండి నుండి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.ఆ తర్వాత సిపిఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేశారు. 2022 సెప్టెంబర్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని ఎన్నికయ్యారు. ఆయన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News