హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివు అన్నారు. ఆయన నోరు యాసిడ్‌తో కడగడం కాదని, నిప్పులు పోసికడిగినా బాగుపడదని మండిపడ్డారు. బిజెపి లాంటి పార్టీలు సమాజానికి పట్టిన చీడ అయితే దానికి పట్టిన పీడ బండి సంజయ్ అని, అడ్డుఅదుపులేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయ సంస్కారం లేకుండా సంజయ్ వ్యాఖ్యలు వున్నాయని, ఖమ్మం జిల్లాకు రాగానే పూనకం వచ్చినట్లు మాట్లాడటం తగదని హెచ్చరించారు.
ఏవో కొన్ని స్థానాలు గెలిచిన బిజెపి అహంకారంతో ఖమ్మం జిల్లాలో ఇతర పార్టీలను ప్రస్తావన చేస్తూ కమ్యూనిస్టుల పని కూడా అయిపోయిందని పిచ్చివాడు స్వర్గంలో విహరిస్తున్నట్లుగా అవాకులు చెవాకులు పేలుతున్నాడన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఓట్లు, సీట్లు కోసం ఏనాడూ తహతహలాడదని, సీట్లకు కోసం బిజెపిలాగా అడ్డమైన పనులకు పాల్పడమన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ఖమ్మం కొచ్చి నిరుద్యోగ మార్చ్ చేయడమ కాదని, బండి సంజయ్‌కు చేతనైతే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని విఫలమైనందుకు ఢిల్లీలోని ప్రధాని నరేంద్రమోడీ నివాసం వద్ద నిరుద్యోగ మార్చ్ చేయాలని సవాల్ విసిరారు.
రానున్న ఎన్నికలలో ఇప్పుడు గెలిచిన స్థానాలకు బండి సంజయ్ గెలిచిన పార్లమెంట్ స్థానం కూడా తిరిగి గెలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి ఖమ్మం జిల్లా ప్రజలు బిజెపిని అధికారమేమోగాని, కనీస స్థానాలను కూడా గెలవనివ్వరన్నారు.