కేసీఆర్ పాలనతో పోలిస్తే రేవంత్ సర్కార్‌కు 90 మార్కులు
చేసిందేమిటి?… చేయాల్సిందేమిటో సమీక్షించుకోవాలి
కాంగ్రెస్ ఏడాది పాలనపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
కూనంనేని సాంబశివరావుతో మన తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూ
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనకు సిపిఐ పార్టీ 60 మార్కులు ఇచ్చింది. డిస్టింక్షన్ మాత్రం ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. ఇచ్చిన హామీల అమలులో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంతో పోల్చితే రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి 90 మార్కులు ఇవ్వొచ్చని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై మన తెలంగాణ ప్రతినిధికి ఆయన ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఇంకా చాలా హామీలను అమలు చేయాల్సి ఉందన్నారు. ఏడాది కాలంలో ఇప్పటి వరకు చేసిందేమిటి? చేయాల్సిందేమిటో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మేధో మధనం చేసుకుంటే బాగుంటుందని సూచించారు. ఇచ్చిన హామీలలో కొన్నింటిని అమలు చేస్తున్నప్పటికీ రైతు భరోసా, కళ్యాణలక్ష్మితులం బంగారం, మహిళాజ్యోతి, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ల పెంపు తదితర హామీలను అమలు చేయాల్సి ఉందని అన్నారు. ఈ పథకాల అమలుపై అధ్యయనం చేయాలని, ముందుగానే అంచనాలు వేసుకొని అమలు చేయాలన్నారు. పథకాల అమలు ద్వారా ప్రజాభిమానం పొందడంలో ప్రభుత్వం డిస్టింక్షన్ సాధించాలని సూచించారు. లేదంటే ప్రజల మద్దతు కోల్పొతారని కూనంనేని హెచ్చరించారు.
అభివృద్ధి ఇంకా ప్రారంభం కాలేదు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభం కాలేదని, అభివృద్ధి చూపించకుండా, కేవలం రైతు చుట్టే తిరిగితే ప్రజలు క్షమించబోరని కూనంనేని అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత తొందరగా అభివృద్ధి చర్యలకు శ్రీకారం చుట్టాలన్నారు. కొంత మేరకు ప్రజాస్వామ్య పాలన కొనసాగుతున్నప్పటికీ, ప్రజాఉద్యమాల పట్ల 144 సెక్షన్ విధింపు, హౌస్ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని, అలాంటి చర్యలను విరమించుకోవాలని సూచించారు. పరిపాలనలో సమన్వయలోపం కనబడుతుందని, ఈ విషయంలో మేధావులతో సమాలోచనలు చేసి సమర్ధవంతంగా ప్రభుత్వాన్ని నడిపించాలని సలహానిచ్చారు. సిఎం హామీ ఇచ్చిన మేరకు ఆర్‌టిసి కార్మికులకు ట్రేడ్ యూనియన్ హక్కును కల్పించాలని కోరారు. ఉద్యోగులకు ప్రతి నెలా వేతనాలు ఇస్తున్నప్పటికీ ,మున్సిపల్, పంచాయతీ, ఆశావర్కర్లు, హోంగార్డులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కూడా ప్రతి నెలా వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని బిజెపి, బిఆర్ పార్టీలు అంటున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని కమ్యూనిస్టులు కోరుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోతే బిజెపి, బిఆర్ వస్తాయా. వాటిని కమ్యూనిస్టులు అంగీకరించేదిలేదు అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉండే విధంగా ప్రజాభిమానాన్ని కాంగ్రెస్ సంపాదించుకోవాలి. మంచిని మంచి, చెడును చెడుగా విమర్శించే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామని సాంబశివరావు అన్నారు. వామపక్షాలు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి లగచర్ల ఫార్మా సిటీ భూసేకరణను ముఖ్యమంత్రి రేవంత్ రద్దు చేయడాన్ని అభినందిస్తున్నామని సాంబశివరావు తెలిపారు. మరో వైపు పునరావాస చట్టంలోని లోపాలను సరిచేసి అవసరమైన మార్పులను తీసుకురావాలని ఆయన కోరారు.
ప్రజాపాలన కార్యక్రమం విఫలం
ప్రజల ఫిర్యాదులను స్వీకరించే ప్రజాపాలన కార్యక్రమం విఫలమైందని కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మంత్రులు, ప్రభుత్వ అధికారులు మరింతగా ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు. ప్రజాప్రతిధులైన ఎంఎల్ ఫోన్ చేస్తే కూడా స్పందించని స్థితిలో మంత్రులు, అధికారులు ఉంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. మాజీ సిఎం వైఎస్ మాదిరిగా ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఒక గంట పాటు ప్రజలను కలవాలని, అప్పుడే ప్రజల బాధలు వారికి అర్ధమౌతాయన్నారు. ప్రజలను కలిసి, వారి సమస్యలను తెలుసుకునేందుకు తగిన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలన్నారు.
బిఆర్‌ఎస్, బిజెపిలకు మాట్లాడే హక్కులేదు
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను విమర్శిస్తున్న బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు పదేళ్లుగా రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉండి ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం తప్ప, ప్రజలకు చేసిందేమీలేదని సాంబశివరావు విమర్శించారు. రాష్ట్రానికి జిఎస్ నిధులు ఇవ్వకుండా, రైతులను ,అసంఘటితరంగ కార్మికులను పట్టించుకోకుండా, లేబర్ కోడ్ తెచ్చిన బిజెపికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలకు తిలోదకాలిస్తుందని, అసలు బిజెపి ఎజెండా అభివృద్ధా?, మతమా? సమాధానం చెప్పాలన్నారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో ఉండనివ్వబోమని, దించేస్తామని బిజెపి ప్రకటించడం గర్హనీయమన్నారు.
గత బిఆర్ ప్రభుత్వం చేసినన్ని వాగ్ధానాలు, చెప్పిన అబద్దాలు ఎవ్వరూ చెప్పలేదని, దళిత బంధు, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీలో విఫలమైన బిఆర్‌ఎస్ రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శించే హక్కు లేదని సాంబశివరావు అన్నారు. బిఅర్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన వాగ్దానాలన్నీ నిరవేర్చిందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం పోతుందని నాలుగున్నర ఏళ్ల తరువాత చివరలో 2వ దఫాలో రూ.11 వేల కోట్ల రుణ మాఫీ మాత్రమే బిఆర్ ప్రభుత్వం చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి దఫాలోనే రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్లు తామే ఇచ్చామంటున్న బిఆర్ ఎస్ మరి అంతకు ముందే ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని ఆయన ప్రశ్నించారు.
మిత్రధర్మం పాటించాలి
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, సిపిఐ మధ్య కుదిరిన అవగాహన ప్రకారం సిపిఐకి కార్పోరేషన్ల చైర్మన్ పదవులు ఇవ్వాల్సి ఉందని సాంబశివరావు అన్నారు. గతంలో ఒకటి రెండు ఎంఎల్‌సి స్థానాలు ఉండగా సిపిఐకి అవకాశం రాలేదని, ఇప్పుడు ఐదారు స్థానాలు భర్తీ కానున్న నేపథ్యంలో సిపిఐకి ఎంఎల్‌సికి అవకాశం ఇవ్వాలని ఆయనన్నారు. అలా ఇవ్వకుంటే కాంగ్రెస్ మిత్రధర్మం ఏముంది అని సాంబశివరావు అన్నారు. సిపిఐ ఒక్క ఎంఎల్ సీటు తమ వల్లే గెలిచిందని కాంగ్రెస్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. సిపిఐ గెలుపులో సిపిఐ(ఎం), టిడిపి, టిజెఎస్‌తోపాటు కాంగ్రెస్ పాత్ర ఎక్కువగా ఉందన్నారు. మరి కాంగ్రెస్ ఎవరి వల్ల అధికారంలోకి వచ్చిందో ఆలోచించుకోవాలని సూచించారు. కమ్యూనిస్టులను తక్కువగా అంచనా వేయవద్దు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలవడం వల్ల వచ్చిన సానుకూల వాతావరణంతోనే కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చిందన్నారు. కమ్యూనిస్టులతో ఎందుకు కలవలేకపోయామా? అని బిఆర్ ఇప్పుడు పశ్చాతాప పడుతోందని సాంబశివరావు వివరించారు.