Thursday, December 26, 2024

రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర.. బిఆర్‌ఎస్‌పై కూనంనేని ఫైర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పేదల భూజాలపై తుపాకులు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఫైర్ చేయాలని బిఆర్‌ఎస్ కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు ఫైర్ అయ్యారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణతో కలిసి ఆయన మంగళవారం -మీడియా సమావేశంలో మాట్లాడారు. విగ్రహ ధ్వంసం, మసీదు రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలపైన సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెటిఆర్‌కు రక్షణ కవచం కావాలని, అందుకే ఆయనకు కమ్యూనిస్టులు గుర్తుకొస్తున్నారని విమర్శించారు. తాము ప్రజలకు మాత్రమే కవచంగా ఉంటామని కూనంనేని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనల వెనకాల ఉన్నది ఒక శక్తినా?, లేదా ఒక వ్యక్తినా?, రాజకీయ పార్టీ నా? తేలాలని చెప్పారు. బిజెపి శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి త్వరలోనే ముఖ్యమంత్రి మారుతున్నారని చెబితే, మరోవైపు కెటిఆర్ సిఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్యలు ఉన్నాయని చెబుతున్నారని, ఈ రెండు వ్యాఖ్యల మధ్య సంబంధాలు ఉన్నాయన్నారు. వికారాబాద్ జిల్లాలో అధికారులపై దాడిని ఆయన ఖండించారు. వికారాబాద్ ఘటనకు సంబంధించిన రైతుల సమస్యను, దాడి జరిగిన కోణాన్ని వేర్వేరుగా చూడాలని సూచించారు. ఈ దాడి పేరుతో పేదల, రైతులపైన ఎటువంటి కేసులు నమోదు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతులు పండించే పంట భూమి లేకుండా,జనవాసాలకు సంబంధం లేని దూరమైన ప్రాంతాల్లో, కాలుష్య నివారణ చర్యలు చేపట్టి ఫార్మాకంపెనీలను ఏర్పాటు చేయాలని కూనంనేని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

కులగణన విషయంలో రెండు,మూడు అంశాలు అభ్యంతకరంగా ఉన్నాయని, ఆధార్ ఐచ్చికం అని పెట్టినప్పటికీ దరఖాస్తుదారులను ఒప్పించాలని సూచించారని, ఆస్తులు, ఆదాయం, అప్పులు లాంటి సమాచారం ఎందుకు అడుగుతున్నారని, ఇలాంటి ప్రశ్నల ద్వారా ప్రజల్లో భయందోళన కలుగుతోందని ఆయనన్నారు. కులగణనపై బిఆర్‌ఎస్ అర్థమై, అర్థం కానట్టుగా మాట్లాడితే ,బిజెపి మాత్రం అడ్డంగా మాట్లాడుతోందని మండిపడ్డారు. బిజెపిది ప్రమాదకరమైన బావజాలమని, ఆ పార్టీకి కులగణన వద్దని, కాని మతం కావాలని, ఇది దేశానికి ప్రమాదకరమని కూనంనేని అన్నారు. హైదరాబాద్ 144 సెక్షన విధించడం మంచిది కాదని, ఇటీవల విద్యార్థులపైన లాఠీచార్జ్ చేయడం మంచిది కాదని,పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

బిజెపి గెలిస్తే జమిలీ ఎన్నికలు: నారాయణ
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే, ప్రధాని మోదీ జమిలి ఎన్నికలకు సిద్ధమవుతారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. జమిలి ఎన్నికలు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమని, అనార్థాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగించే రీతిలో మోదీ, అమిత్ షా రాజకీయాలు చేస్తున్నారని, వారు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారారని దుయ్యబట్టారు. కులగణన మంచి కార్యక్రమమని, అనవసరమైన ప్రశ్నలతో దీనిని వివాదస్పదం చేసుకోద్దని నారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కులగణనలోని ప్రశ్నలు సరళతరంగా ఉండాలని,దీనికి సంబంధించి ఒక యాప్ ఏర్పాటు చేస్తే, అందులో ప్రజలు వారి వివరాలు పొందపరుస్తారన్నారు.

ఆర్థిక, రాజకీయ, సమానత్వం కలిగేలా కులగణన ఉండాలని సూచించారు. కులాలు, మతాలపైన అభిమానం ఉండాలని, కానీ, కుల,మతతత్వం ఉండకూడదని చెప్పారు. వికారాబాద్ కలెక్టర్ దాడి చేయడం సరైంది కాదని, అదే సమయంలో రైతుల బాధను,వారి ఆవేదనను కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని సూచించారు. దాడి చేశారనే నెపంతో ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసి చర్యలు తీసుకోవద్దన్నారు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడం, ఆయనను ప్రధాన న్యాయమూర్తి ఆహ్వానించడం రెండూ తప్పేనని, రాజకీయాల్లో ఇది దుష్ట సంప్రదాయమని, ఇటువంటివి న్యాయ వ్యవస్థకు కలంకం తీసుకొస్తాయని చెప్పారు.
ఈనెల 14న రౌండ్ సమావేశం
మూసీ, హైడ్రా విషయంలో ఈనెల 14న మేథావులతో కలిసి రౌండ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో అన్ని అంశాలను చర్చించి, సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయనున్నట్టు కూనంనేని సాంబశివరావు తెలిపారు. పేదలకు ఎటువంటి న్యాయం జరగాలని, ఎలా స్పందించాలి అనే అంశంపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News