మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌పై సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. తమిళిసై గవర్నరో, బిజెపి కార్యకర్తో అర్థం కావడం లేదన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. తమిళిసై తెలంగాణ నుండి వెళ్లిపోవాలని ఆయన కోరారు. త్వరలోనే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఆయన చెప్పారు. బ్రిటీష్ కాలం నుండి వచ్చిన ఈ గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఉమ్మడి ఎపి రాష్ట్రంలో కూడా గతంలో గవర్నర్ వ్యవస్థలను ఎలా ఉపయోగించుకొని ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను ఎలా ఇబ్బంది పెట్టారో ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కేరళ, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును కూనంనేని గుర్తు చేశారు. గవర్నర్ వ్యవస్థను పాలకులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రధానికి తెలంగాణపై ఆనుకోని ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు.
దురుద్దేశ్యంతోనే మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారని ఆయన విమర్శించారు. గత ఏడాది ప్రారంభమైన ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభించేందుకు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మోడీ పర్యటనను అడ్డుకంటామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుండి సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రధాని రాష్ట్రానికి రావడానికి వీల్లేదని ప్రచారం చేస్తామనానరు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
ఆ ఐదు గ్రామాలు తెలంగాణకు ఇవ్వాలి : చాడ డిమాండ్
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి మోడీ రావడం అంటే రాజకీయ స్వార్థం కోసమేనని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అదే రామగుండంలో సింగరేణి కాలరీస్‌ని ప్రైవేట్ చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ పెద్ద పెట్టున నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. నరేంద్ర మోడీ తెలంగాణకు విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలదని దుయ్యబట్టారు. మోడీ ఎపితో కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. భద్రాచలంకు సంబంధించిన ఆ ఐదు గ్రామాలు తెలంగాణకు ఇవ్వాలని చాడ డిమాండ్ చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం బొగ్గు బావుల ఆధారితమని గుర్తు చేశారు.
అన్ని సింగరేణి కార్మిక సంఘాలతో కలిసి
మోడీ పర్యటనను అడ్డుకుంటాం: ఎఐటియుసి కార్యదర్శి బోసు
నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థల వ్యతిరేకి అని ఎఐటియుసి కార్యదర్శి బోసు ఆరోపించారు. కేంద్రం వాటా ఆదానికి అమ్మడం కోసం మోడీ ప్రయత్నం చేస్తున్నాడని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మిదాని, డిఆర్‌డిఎల్ ప్రైవేటు పరం చేయడానికి కుట్రలు చేస్తున్నారని, కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం అన్ని కార్మిక సంఘాలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తున్నామని వెల్లడించారు. మోడీ సింగరేణి బావులు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. విదేశాల నుండి అధిక ధరకు బొగ్గు కొనుగోలు చేసి ఇక్కడ బొగ్గు బావులు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని సింగరేణి కార్మిక సంఘాలతో కలిసి మోడీ పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
Kunamneni Sambasiva Rao slams Governor Tamilisai