శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సోమవారం మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో మొత్తం నలుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ఈ సందర్భంగా సంఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు. కుప్వారాలోని లోలాబ్ ప్రాంతంలో ఉగ్రవాది షౌకత్ అహ్మద్ షేక్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని నుంచి రాబట్టిన సమాచారంతో.. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు.
ఈ క్రమంలో బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరుపడంతో నలుగురు మృతి చెందారని సోమవారం పోలీసులు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల్లో పాక్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాది షౌకత్ అహ్మద్ షేక్ సైతం ఉన్నట్లు చెప్పారు. ఆదివారం కుల్గామ్ జిల్లా దమ్హాల్ హంజిపోరా ప్రాంతంలో గుజ్జర్‌పోరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకోగా.. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులను కుల్గామ్‌కు చెందిన జాకీర్ పదార్, శ్రీనగర్‌కు చెందిన షరీఫ్‌గా గుర్తించారు.