Sunday, September 8, 2024

పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి ఎందుకు సీట్లు పెరిగాయి..?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ 12 సీట్లు గెలవాల్సిన ఉంటే
ఎనిమిది మాత్రమే ఎందుకు గెలిచినట్లు..?
కురియన్ కమిటీ ఆరా
మొదటి రోజు కాంగ్రెస్ ఎంపీలు, ఓడిపోయిన ఎంపీ అభ్యర్థుల నుంచి
వివరాలు సేకరించిన కమిటీ సభ్యులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ(కురియన్ కమిటీ) మొదటి రోజు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కురియన్ కమిటీ కాంగ్రెస్ ఎంపీలు, ఓడిపోయిన ఎంపీ అభ్యర్థుల నుంచి వివరాలను సేకరించింది. వారు చెప్పిన వివరాలను కమిటీ సభ్యులు నోట్ చేసుకున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికలో తెలంగాణలో బిజెపికి ఎందుకు సీట్లు పెరిగాయనే అంశాలపై కురియన్ కమిటీ దృష్టి పెట్టింది. 12 సీట్లు గెలవాల్సిన ఉంటే ఎనిమిది మాత్రమే ఎందుకు గెలిచినట్లు అని ప్రశ్నించింది. మహబూబ్‌నగర్, మెదక్‌లో ఏం జరిగిందని కురియన్ కమిటీ ఆరా తీసింది. శుక్రవారం జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించనుంది. ఇందులో డిసిసి అధ్యక్షులు, ఎంఎల్‌ఎలు, పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ కానుంది. అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఎఐసిసి నేత కురియన్ తెలిపారు.

ఉ.11 గంటలకే సమావేశం ప్రారంభం: కురియన్ కమిటీ సభ్యులు గురువారం ఉదయం 11 గంటల నుంచి గాంధీభవన్‌లో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన 17 మంది అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌తో భేటీ మొదలైంది. ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఓటమిపాలైన పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులతో మొదలైన భేటీలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, నీలం మధు, వి.రాజేందర్‌రావు, జీవన్ రెడ్డి, ఆత్రం సుగుణలు హాజరైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా సాయంత్రం సురేశ్ షెట్కార్, మల్లు రవి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య తదితరులు హాజరయ్యారు.

బిఆర్‌ఎస్, బిజెపి అంతర్గత పొత్తువల్లే 8 సీట్లకు పరిమితం: చామల కిరణ్ కుమార్ రెడ్డి
రాష్ట్రంలో 12 నుండి 13 ఎంపి సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచేదని, బిఆర్‌ఎస్, బిజెపి అంతర్గత పొత్తుతో 8 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పనితీరు గురించి కురియన్ కమిటీకి వివరించినట్లు తెలిపారు. కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్ల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువగా ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి రాజకీయ సమీకరణాలు మారిపోయాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఎన్నికలు జరిగాయని, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బిజెపి వర్సెస్ కాంగ్రెస్‌గా జరిగాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు ఒక అవగాహనతో కాంగ్రెస్ పార్టీని రెండో స్థానంలో ఉంచాలనుకున్నారని ఆరోపించారు. చాలా స్థానాల్లో బిఆర్‌ఎస్ సరైన అభ్యర్థులను బరిలోకి దించలేదని అన్నారు. బిఆర్‌ఎస్ ఓటు బ్యాంక్ బిజెపికి బదిలీ అయినందుననే 12 స్థానాలు రావలసిన కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు వచ్చాయని పేర్కొన్నారు.
సిఎం రేవంత్‌రెడ్డిని కలిసిన కురియన్
కాంగ్రెస్ నేతలు పిజె కురియన్, రకిబుల్ హుస్సేన్ తదితరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి సిఎం రేవంత్‌రెడ్డి శాలువాతో సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News