హైదరాబాద్ : పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన కురువ విజయ్ కుమార్ డిజిపికి బుధవారం ఫిర్యాదు చేశారు. పిసిసి ప్రచార కమిటీ సభ్యుడిగా పనిచేసిన విజయ్ కుమార్ బుధవారం డిజిపి అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ఫిర్యాదుపై డిజిపి సానుకూలంగా స్పందించారన్నారు. ఈ అంశంపై తక్షణమే విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ కోసం పదిహేనేళ్లుగా పని చేసిన తనను కాదని, నిన్న మొన్న పార్టీలో చేరిన వ్యక్తికి గద్వాల టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ఎంఎల్‌ఎ టికెట్లను డబ్బులకు, భూములకు అమ్ముకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎంఎల్‌ఎ టికెట్ల విషయంలో రేవంత్‌రెడ్డి డబ్బులు తీసుకోకపోతే భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఇడికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ కారణంగానే రేవంత్ అనుచరులు తనను వేధిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశామని, పదిహేనేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నామన్నారు. అలాంటి తనను అకారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన తమను అణగదొక్కడానికి రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.