న్యూస్‌డెస్క్: చికిత్స కోసం కోల్‌కతా వచ్చిన ఒక కువైటీ మహిళ అదృశ్యమై ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో ప్రత్యక్షమైంది. ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు పశ్చిమె బెంగాల్ పోలీసులు తీవ్రంగా శ్రమించారు. జనవరి 20వ తేదీన కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చర్మవ్యాధికి సంబంధించిన చికిత్స కోసం కువైట్ నుంచి తన సోదరుడితో కలసి వచ్చిన ఒక మహిళ హఠాత్తుగా అదృశ్యమైపోయింది. ఒక గుర్తుతెలియని వ్యక్తితో కలసి గతవారం ఆమె అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించినట్లు కోల్‌కతా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. బంగ్లాదేశ్‌లోని ఒక ఇంట్లో ఆమెను కనుగొన్న బంగ్లాదేశ్ పోలీసులు ఆమెను అక్కడి కువైటీ పోలీసులకు అప్పగించారు. ఆ మహిళ అదశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఎలా ఛేధించగలిగారో కోల్‌కతా పోలీసులు మీడియాకు వివరించారు. తన సోదరుడితో కలసి గత నెల 20న కోల్‌కతాకు వచ్చిన ఆ కువైటీ మహిళ ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో బసచేసింది.
కోల్‌కతాలోని పర్యాటక ప్రదేశాలను ఆమె తన తమ్ముడితో కలసి సందర్శించింది. జనవరి 27న అలీపూర్ జూకు వెళ్లి ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తమ్ముడు వచ్చీరాని ఇంగ్లీష్‌లో తన అక్క మాయమైన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె మొబైల్ ఫోన్‌లో కువైటీ సిమ్ ఉండడంతో ఆమె ఆచూకీని కనిపెట్టడం పోలీసులకు అసాధ్యమైంది. దీంతో సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలించడం ప్రారంభించారు. అలా పరిశీలిస్తున్న సమయంలో సూటు ధరించిన ఒక పురుషుడితో కలసి ఆ కువైటీ మహిళ పసుపు రంగు ట్యాక్సీ ఎక్కడం కనిపించింది. ఆ మగ మనిషిని గుర్తుపట్టడం కష్టమైనప్పటికీ ఆ ట్యాక్సీడ్రైవర్ ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. అతడిని ప్రశ్నించగా తన కారులో ఎక్కిన ఇద్దరూ సెంట్రల్ కోల్‌కతాలోని మార్కిస్ వీఢి సమీపంలో దిగిపోయారని ట్యాక్సీ డ్రైవర్ చెప్పాడు.
అక్కడి నుంచి వేరే ట్యాక్సీ ఎక్కి పొరుగున ఉన్న ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బంగావ్ వద్ద దిగారు. అది బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామం. వందలాది సిసిటివి ఫుటేజ్‌ల ఆధారంగా ఆమె వెంట ఉన్న వ్యక్తిని బంగ్లాదేశ్ జాతీయుడిగా పోలీసులు గుర్తించారు. వారిద్దరూ కలసి అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని బంగ్లాదేశ్‌లోకి చొరబడినట్లు కోల్‌కతా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ సమాచారాన్ని న్యూఢిల్లీలోని కువైటీ ఎంబసీకి తెలియచేయగా వారు వెంటనే బంగ్లాదేశ్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఎట్టకేలకు ఆ దేశంలో ఆమె ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన బంగ్లాదేశీ పోలీసులు ఆమెను తమ దేశంలోని కువైటీ ఎంబసీ అధికారులకు అప్పగించారు. ఆమెను బంగ్లాదేశ్‌కు తీసుకువచ్చిన వ్యక్తికి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. కాగా..తమ దేశ పౌరురాలిని కాపాడడంలో చురుకుగా వ్యవహరించిన కోల్‌కతా పోలీసులను కువైటీ ఎంబసీ అభినందించింది.