మనతెలంగాణ/హైదరాబాద్: బోగస్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ గడువు సమీపిస్తోంది. ఈ నెల 31తో ఈకేవైసి గడువు ముగియనుంది.రేషన్‌కార్డులను ఇంకా అప్డేట్ చేయించుకోని వారు వెంటనే పూర్తిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చాలా పాత కార్డుల్లో చనిపోయిన వారి పేర్లు, వివాహం అనంతరం కుటుబం నుంచి వేరుపడి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయన వారు, ఉపాధి రిత్యా ఇతర గ్రామాలకు జిల్లాలకు తరలిపోయిన వారు, అడ్రస్‌మార్పులు తదితర మార్పులు చేర్పులు, పేర్ల తొలగింపులు తదితరాలకు సంబంధించి రేషన్‌కార్డును అప్‌డేట్ చేసుకోవాలని కోరుతూ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ ప్రక్రియను ప్రారంభించింది.
ఇటువంటి వారి రేషన్‌కార్డులు అప్‌డేట్ కాకపోవటంతో రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయి. దీనిని అరికట్టేందుకు రాష్ట్రంలో గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా లబ్ధిదారుల నుంచి వేలిముద్రలను మళ్లీ సేకరిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు అక్కడి రేషన్ షాపుల్లో కేవైసీ పూర్తిచేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 31తో కేవైసీ ప్రక్రియ ముగియనున్నది. మరోసారి గడువు పెంచే అకాశం లేదని అధికారులు వెల్లడించారు.