న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటన ప్రతిపాదనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జి) వికె సక్సేనా తిరస్కరించారు. ఆగస్టు 1న సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ నగరాల సదస్సుకు వెళ్లాలని కేజ్రీవాల్ భావించారు. ఈ మేరకు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అనుమతి కోసం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఒక ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ సదస్సు మేయర్లకు ఉద్దేశించిందని, అందులో ముఖ్యమంత్రి పాల్గొనడం సబబుగా ఉండదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ సూచించినట్లు వారు తెలిపారు. ఆ సదస్సులో పట్టణ పాలనకు సంబంధించిన అంశాలు ఉంటాయని, అవి ఎంసిడి, డిడిఎ, ఎన్‌డిఎంసి వంటి వివిధ సంస్థలు పరిధిలోనివని, ముఖ్యమంత్రికి ఈ అంశాలపై అవగాహన ఉండదని సక్సేనా పేర్కొన్నారు. ఆ సదస్సుకు ముఖ్యమంత్రి వెళ్లడం మంచి సాంప్రదాయం కూడా కాదని కూడా సక్సేనా అన్నట్లు వర్గాలు తెలిపాయి.