న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా కమిషన్ చీఫ్ స్వాతికి జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిస్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా చెత్త రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. నగరంలో శాంతిభద్రతలు మెరుగుపరచడానికి బదులు దిగజారుస్తున్నారన్నారు. ఎయిమ్స్ బయట నిలుచున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్‌ను ఓ వ్యక్తి తన కారుతో 10 నుంచి 15 మీటర్ల వరకు లాక్కెళ్లిన ఉదంతం తర్వాత కేజ్రీవాల్ స్పందించారు.
ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు పెచ్చరిల్లాయి. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా పదేపదే ప్రభుత్వ అధికారులను నేరుగా పిలిపించుకుని మాట్లాడుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. “ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. మెరుగుపరిచే చర్యలు చేపట్టడానికి బదులు లెఫ్టినెంట్ గవర్నర్ చెత్త రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఆయన నేడు కూడా ఢిల్లీ ప్రభుత్వ అధికారులను పిలిపించుకుని మాట్లాడారు. ఆయనకు ఆ అధికారం లేదు. ప్రభుత్వ పనితీరులో కల్పించుకునే అధికారం కూడా ఆయనకు లేదు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
Law n order situation fast deteriorating in Del. LG, rather than taking steps to improve it, busy playing dirty politics. He has called series of meetings of Del govt officers today, which he has no powers to do, to further meddle and interfere in elected govt’s functioning pic.twitter.com/bdcz0oqkpY
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 20, 2023