ప్రధాని మోడీకి అఖిలేష్ కౌంటర్
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దంమొదలైంది. ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఎర్ర టోపీలు(సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు ధరిస్తారు) ధరించేవారికి ఎర్ర బల్బు(మంత్రుల కార్లపైన ఉండే సైరన్)పైనే వ్యామోహమని, ఉత్తర్ ప్రదేశ్‌కు వారు ప్రమాద హెచ్చరికలంటూ ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఘాటుగా విమర్శించారు. దీనికి కొద్దిగంటల్లోనే అఖిలేష్ యాదవ్ ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ నాయకులు ధరించే ఎర్ర టోపీలు బిజెపికి కూడా ప్రమాద హెచ్చరికలని, వీరే వచ్చే యుపి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించుతారని ఆయన వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న దైన్య స్థితి, మహిళలు, యువతపై దాడులకు సంబంధించిన హత్రాస్, లఖింపూర్ ఖేరీ(సంఘటనలు), ధ్వంసమైన విద్యా వ్యవస్థ, వ్యాపార, ఆరోగ్య రంగాలు వంటివన్నీ యుపిలో బిజెపికి ప్రమాద హెచ్చరికలేనని, ఇవే బిజెపిని అధికారం నుంచి తప్పిస్తాయంటూఅఖిలేష్ ట్వీట్ చేశారు.