సిద్దిపేట : సిఎం కెసిఆర్ ఆశీస్సులతో భవన నిర్మాణ కార్మికరంగ కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం అధ్యక్షన రాష్ట్రంలోని వివిధ జిల్లా నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడు కార్డు కలిగి ఉండాలని అందుకు అవసరమైన డబ్బులు తానే వెచ్చిస్తున్నట్లు కార్డు ఉంటేనే మీరు లబ్ధిపొందే అవకాశం ఉందన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకొని కార్డు పొందాలన్నారు. క్యాంపు కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేసినట్లు అవసరమైతే మీ అనువైన సమయం అమావాస్య రోజున ఐదు కౌంటర్లు ఏర్పాటు చేయిస్తానన్నారు. మీ ఆరోగ్యం పై శ్రద్ధ వహించి మీ కుటుంబం బరువు బాధ్యత మీ పై ఆధారపడి ఉన్న సంగతి మరువవద్దన్నారు.
రైతు బీమా తరహాలో కార్మిక బీమా
రైతుబీమా తరహాలో కార్మిక బీమా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిజిటల్ కార్డుల రూపకల్పనకు స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. అప్పటికప్పుడు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి , కమిషనర్ రాణికౌముదితో చర్చించారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఓ ఏజెన్సీ ద్వారా సభ్వత్వం పొందిన కార్మికుడి వేలిముద్ర సేకరించి, నామిని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో సమగ్రమైన సమాచారం కలిగి ఉండడంతో అర్హులైన మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలం అందుతుందన్నారు. ఒక్కసారి డిజిటల్ కార్డు చేసుకుంటే ఐదేళ్ల వరకు పరిమితం అయిందని తిరిగి రెన్యూవల్ బాధలకు మీరు పడుతున్న బాధలు గుర్తించి ఇప్పుడు ప్రభుత్వం పదేళ్లకు పెంచిందన్నారు.ఇది వరకు లక్షన్నర ఉన్న భవన నిర్మాణ కార్మికుడి బీమా ఇక నుంచి రూ.3 లక్షలకు పెంపునకు సీఎం కేసీఆర్‌తో చర్చించి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇటీవల కార్మిక శాఖ కార్మికుడి వైద్య సేవలపై చర్చించి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రూ. 5 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే క్యాన్సర్ గుండె చికిత్సలకు రూ. 10 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తించేలా ఆగస్టు నెల నుంచి అమలు కాబోతుందన్నారు.సిద్దిపేట శివారు మందపల్లి కార్మిక భవన్ నిర్మాణం కోసం ఎకరం స్ధలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేటలో ఎల్ అండ్‌టి, సెట్విన్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా శిక్షణ కేంద్రం, న్యాక్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయని వాటి ద్వారా మీలో నైపుణ్యాలను పెంచుకోవచ్చన్నారు. ఆయా శిక్షణ కేంద్రాలకు వెళ్లేలా మీ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆసక్తికరంగా ఫోన్లైన్లో మంత్రుల సంబాషణ
సిద్దిపేటలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభలో ఆసక్తికరంగా ఫోన్ లైన్లో కార్మిక మంత్రి మల్లారెడ్డి, ఆరోగ్య మంత్రి హరీశ్ సంబాషణలు జరిపారు. కార్మికులను ఉద్దేశించి కష్టపడ్డ, పాలు అమ్మిన, పూలు అమ్మిన ఎమ్మెల్యేగా మీ కార్మిక మంత్రిగా ఇవాళ మీతో మాట్లాడుతున్నానని అక్కడి సభలో కార్మికుందరినీ ఉత్సాహ పరిచారు. మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు సిద్దిపేట జిల్లాతో పాటు రాష్ట్రంలో జిల్లాకో కార్మిక భవన్ మంజూరు కార్మిక మంత్రిగా డిక్లేర్ చేస్తున్నా అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పారుఖ్ హుస్సెన్, ప్రజాప్రతినిధులు , నాయకులు, భవన నిర్మాణ కార్మిక రంగాల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.