అమరచింత : కార్మిక సమస్యల సాధన కోసం ఆగస్టు 4వ తేదిన హైదరాబాద్ ఇందిరా గాంధీ పార్క్ దగ్గర జరిగే కార్మిక గర్జనకు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర ఐఎఫ్‌టియు సహాయ కార్యదర్శి సి. రాజు అన్నారు. శుక్రవారం అమరచింత మార్క్ భవనలో ఐఎఫ్‌టియు కార్మిక గర్జన గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సి. రాజు మాట్లాడుతూ శ్రమ సమస్త సంపదకు మూలం కానీ ఆ శ్రమ జీవుల జీవితాలు చీకట్లు కమ్ముకున్నాయని, చాలీ చాలని జీతభత్యాలతో ఎలాంటి సామాజిక భద్రత లేని స్థితిలో కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అనేక రంగాలో కార్మిక వర్గం ఉందని, రాష్ట్రంలో సుమారుగా 20 లక్షల మంది భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని, మున్సిపాలిటీలో 50వేలు, గ్రామ పంచాయతీలో 60వేలు, విద్యుత్‌లో 25వేలు, కొన్ని లక్షల మంది బిడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. అనేక రకాల కార్మిక వర్గాలకు కనీస పెన్షన్ లేక ఇబ్బందులకు గురవుతున్నారని, కాబట్టి రానున్న ఎన్నికల నేపథ్యంలో కార్మిక వర్గం సమస్యల కోసం, హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బిడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎ. సామెల్, ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు బి. భక్తరాజ్, కె. ప్రేమరత్నం, జిలాని, అఖిల భారత రైతు సంఘం నాయకులు మహమూద్ తదితరులు పాల్గొన్నారు.