మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర తహశీల్దార్ల సంఘం పూర్వ అధ్యక్షుడు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. ఆయన ఏప్రిల్ 14వ తేదీన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్టగా సమాచారం. ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి మెయిల్ చేసినట్టుగా తెలుస్తోంది. లచ్చిరెడ్డి కీసర ఆర్డీఓగా ఉన్న సమయంలో మంత్రివర్గం సమావేశంలో జరిగిన విషయాలను తెలుసుకోవడానికి అప్పటి మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారన్న కారణంతో ఆయన్ను ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలోనే లచ్చిరెడ్డి కొంత కాలంగా విధులకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన పదవీ రాజీనామా చేయాలని నిర్ణయించారు.
ఈ మధ్య రెవెన్యూ సమస్యలపై జాతీయ స్థాయిలో డిజిటల్ ప్లాట్ ఫారం ఏర్పాటు చేసేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇటీవల ఓ యాప్‌ను కూడా ఆయన ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు సంస్థ ఆవిష్కరించింది. భూ పరిపాలన విధానంలో అవసరమైన సంస్కరణలను తీసుకొచ్చే అంశంపై రెవెన్యూ చట్టాల నిపుణులు, సీనియర్ న్యాయవాదులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను లచ్చిరెడ్డి ఇందులో భాగస్వాములను చేశారు. ఈ క్రమంలోనే తిరిగి ఆయన్ను భూపాలపల్లి ఆర్డీఓగా పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. ఆయన ఉద్యోగంలో చేరని పక్షంలో ఆయనపై చర్యలు తీసుకోవాలన్న లక్ష్యంతో ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. కానీ అంతకుముందే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్టగా తెలిసింది.