సెంట్రల్ స్కూల్ టీచరు ఆవిష్కరణ
ముంబై : లేడీ రోబో షాలూ ఏకంగా తొమ్మిది భారతీయ భాషలు, 38 విదేశీ భాషలను మాట్లాడుతుంది. బొంబాయి ఐఐటి అనుసంధాన కేంద్రీయ విద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు దినేష్ ఠాకూర్ ఐటి పరిజ్ఞానంతో ఈ విశేష హ్యుమనాయిడ్‌ను రూపొందించారు. బహుభాషలు మాట్లాడే ఈ రోబో అచ్చం మరాఠా మహిళను తలపిస్తుంది. తెలుగు, హిందీ, మరాఠీ, భోజ్‌పురి, తమిళ్, మలయాలం వంటి పలు భాషలలో మాట్లాడుతుంది. ఆంగ్లంతో పాటు పలు ఇతర పరాయి భాషలలోనూ దిట్టగా నిలిచింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన హన్సన్ రోబోటికి రూపొందించిన సోఫియాను ఇది తలపిస్తుంది. దినేష్ సృజనాత్మక ఆవిష్కరణలో రూపొందిన షాలూ మాట్లాడటమే కాదు కరచాలనం చేయడం, నవ్వులు చిందించడంతో పాటు అవసరం అయినప్పుడు కోపం కూడా వ్యక్తం చేస్తూ మనిషి భావోద్వేగాలను కూడా వ్యక్తం చేయగల్గుతుంది. ఈ రోబోను తాను ప్లాస్టిక్, కార్డ్‌బోర్డు, చెక్క, అల్యూమినియం వంటి వాటితో రూపొందించినట్లు దినేష్ పటేల్ తెలిపారు.
దీనిని రూపొందించేందుఉ తనకు మూడేండ్లు పట్టిందని, దాదాపు రూ 50000 ఖర్చు అయిందని వివరించారు. మనుష్యులను గుర్తిస్తుంది. విషయాలను నెమరేసుకుంటుంది. విజ్ఞాన విషయాలు, లెక్కలకు సంబంధించి వేసే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. వార్తా పత్రిక అందిస్తే చదివేస్తుంది. షాలూను స్కూళ్లలో టీచరుగా కూడా వినియోగించుకోవచ్చునని దినేష్ తెలిపారు. ఆఫీసులలో రిసెప్షనిస్టు అయితే మరీ మంచిదన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తీర్చిదిద్దడం వల్ల షాలూ మరింత అందంగా ఉందని, పైగా మాస్క్‌తో కుదురుగా కన్పిస్తుందని తెలిపారు. ప్రస్తుత యాంత్రిక జీవన పద్ధతులలో ఇకపై ఇటువంటి హ్యుమనాయిడ్స్ మన జీవనవిధానానికి ఊరట నిస్తాయని దినేష్ చెప్పారు.