Friday, December 20, 2024

లగచర్ల దాడి ఘటనలో కీలక పరిణామం

- Advertisement -
- Advertisement -

లొంగిపోయిన ప్రధాన నిందితుడు సురేశ్, 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ న్యాయమూర్తి
ఈ కేసులో ఎ2 సురేశ్‌తోపాటు మరో ఇద్దరి అరెస్టు, ఇప్పటివరకు 29 మంది అరెస్టు

మన తెలంగాణ/కొడంగల్/దౌల్తాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గం, లగచర్ల ఫార్మా దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాడి ఘటనలో కీలక నిందితుడిగా పోలీసులు భావిస్తున్న ఏ2 బోగమోని సురేశ్ ఎట్టకేలకు కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు. దాడి జరిగిన రోజు కలెక్టర్, పలువురు అధికారులను గ్రామంలోకి రావాలని అంటూ వారిని తన మాయమాటలతో గ్రామంలోకి రప్పించిన సురేశ్ దాడిలో ఎక్కడా పాల్గొనలేదు. దాడి జరిగిన సమయంలో ఎక్కడా కనబడలేదు.

కానీ ఘటన జరిగినప్పటి నుండి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు ఆరోజు నుంచి నాలుగు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టినా దొరకలేదు. దాడి జరిగి వారం రోజులైనా అతని ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం సురేశ్ తన లాయర్‌ను వెంట పెట్టుకొని కొడంగల్ మున్సిఫ్ కోర్టులో జడ్జి శ్రీరాం ముందు లొంగిపోయాడు. దీంతో అతనికి కొడంగల్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం జడ్జి అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో సంగారెడ్డి జైలుకు తరలించారు.

సురేష్‌తో పాటు పోలీసులు మంగళవారం రోజు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిని సైతం పోలీసులు కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. సురేశ్‌తో పాటు ఆ ఇద్దరికి జడ్జి 14 రోజుల రిమాండ్‌ను విధించారు. వారిని కూడా వైద్యపరీక్షల అనంతరం సంగారెడ్డి జైలుకు తరలించారు. దీంతో లగచర్ల దాడి ఘటనలో ఇప్పటివరకు 29 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News