Friday, December 20, 2024

ఇదేనా రాజ్యాంగ రక్షణ?

- Advertisement -
- Advertisement -

 సిఎం రేవంత్ ఇలాకాలో గిరిజనులపై జరుగుతున్న దమనకాండ కనిపించడం లేదా? రాజ్యాంగ రక్షకుడినని
చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ స్పందించరేం? లగచర్ల ఘటన మణిపూర్, లక్షద్వీప్ కంటే తక్కువేం కాదు అల్లుడి
కోసం సిఎం నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైర్ లగచర్ల బాధితులతో కలిసి
ఢిల్లీలో మీడియా సమావేశం జాతీయ మానవ హక్కుల సంఘం, ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ను కలిసిన బాధితులు

మనతెలంగాణ/హైదరాబాద్ : తన అల్లుడి కంపెనీల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. తరతరాల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను రైతుల నుంచి లాక్కుంటున్నారని ఆరోపించారు. 9 నెలలుగా ఆందోళన చేస్తున్నా వారి వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి, పరిశ్రమల మంత్రితో పాటు అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్నారు. అంతేగాక వాళ్లపై కేసులు పెట్టారని అన్నారు. బిఆర్‌ఎస్ నేతలు సోమవారం లగచర్ల బాధితులతో కలిసి జాతీయ మానవహక్కుల సంఘాన్ని కలిశారు. అనంతరం బాధితులతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లగచర్ల బాధితులు మీడియాకు తమ గోడు చెప్పుకున్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో ఏం జరుగుతుందో దేశానికి తెలియాలని.. పేద గిరిజనుల భూములను రేవంత్ సర్కార్ బలవంతంగా గుంజుకుంటోందని ఆరోపించారు. లగచర్ల ఘటనపై తమ పార్టీ నేతలందరూ జాతీయ మానవహక్కుల, మహిళా హక్కుల కమిషన్‌ను కలిశారన్నారు. ఎస్‌టి హక్కుల కమిషన్ సైతం కలిసి లగచర్ల దమనకాండ వివరించారని చెప్పారు. సిఎం నియోజకవర్గంలో తొమ్మిది నెలలుగా గొడవలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఎకరానికి రూ.60-రూ.70 లక్షల విలువైన భూమికి రూ.10 లక్షలు ఇస్తామంటున్నారని.. లగచర్ల అర్ధరాత్రి మహిళలనీ చూడకుండా దాడులు చేశారన్నారన్నారు.

లగచర్లలో అర్ధరాత్రి పోలీసులు, ప్రైవేటు వ్యక్తులతో కలిసి దళిత రైతుల ఇళ్లపై దౌర్జన్యకాండ జరుగుతుందని.. సిఎం బ్రదర్ గిరిజన రైతులపై దాడి చేసినా కేసులుండవు అని విమర్శించారు. ప్రజాప్రతినిధి కాకున్నా సిఎం సోదరుడికి కలెక్టర్ స్వాగతం పలుకుతున్నారన్నారు. రాజ్యాంగ రక్షకులమంటున్న రాహుల్ గాంధీ సిఎం నియోజకవర్గంలో దమనకాండపై స్పందించాలన్నారు. లగచర్లలో అర్ధరాత్రి మహిళలపై పోలీసుల దాడి చేశారని.. గిరిజన రైతులపై అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదేనా రాజ్యాంగ రక్షణ..?

మణిపూర్, ఉత్తర్‌ప్రదేశ్ లేదా లక్ష్యద్వీప్.. ఇలా దేశంలోని ఏ మూల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నా బాధపడుతున్నామని కెటిఆర్ తెలిపారు. కానీ లగచర్ల దురాగతం గురించి మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తమ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేస్తుందని రాహుల్ గాంధీ అంటున్నారని.. ఇదేనా రాజ్యాంగ రక్షణ..? అని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని మాటలు చేపట్టం కాదు…మీ పార్టీ ముఖ్యమంత్రి అరాచకాలను ఆపాలని కెటిఆర్ అన్నారు. రాహుల్ గాంధీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని, ఆయనలో మరొక మనిషి ఉన్నట్టున్నారని పేర్కొన్నారు.

రాహుల్‌గాంధీ చెప్పేదొకటి…చేసేదొకటి అని విమర్శించారు. రాహుల్ గాంధీ మాటలు చాలా చెబుతారని, కానీ చేసేదేమీటో మొత్తం దేశం చూస్తోందని అన్నారు.మీరు అదానీ చాలా మాట్లాడుతారు. కానీ తెలంగాణలో అదానీ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. తెలంగాణలో బీసీలు, గిరిజనులు, దళితులు పోరాటం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు. మణిపూర్ గురించి పదేపదే మాట్లాడే రాహుల్‌గాంధీ కొడంగల్‌లోని లగచర్ల గురించి మాత్రం మాట్లాడటం లేదన్నారు. మణిపూర్, లక్షద్వీప్ ఘటనల కంటే లగచర్ల ఘటన చిన్నదేమీ కాదని.. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్పందించాలి

చిన్న పిల్లలు పిలిచినా వస్తా అన్న రాహుల్ గాంధీని, ఇప్పుడు గిరిజన మహిళలు మిమ్మల్ని పిలుస్తున్నారని కెటిఆర్ అన్నారు. ఆయన కొడంగల్‌కు రాలేకపోతే…ఢిల్లీలో ఆయన సమయం ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటామని చెబుతున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం గడువు ముగిసిందని, రాహుల్ ఇప్పటికైనా స్పందించాలని కోరారు. మాటలతో ప్రేమ కురిపిస్తే సరిపోదని.. చేతల్లో చూపించాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం చేస్తున్న భూదందాపై రాహుల్ గాంధీ గారు విచారణ జరిపించాలని కోరారు.

కొడంగల్‌లోనే కాదు.. ఫార్మా విలేజీలు ప్రతిపాదించిన ప్రతి చోటా ఈ పోరాటం జరుగుతోందని కెటిఆర్ తెలిపారు. సిఎం సోదరుడి కంపెనీ కోసమే ఇంతమంది గిరిజనులు బాధపెడుతున్నరని ఆరోపించారు. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియనట్లు బిజెపి నాటకాలు ఆడుతుందని.. సీఎం నియోజకవర్గంలో జరుగుతున్న దమనకాండపై స్పందించాలని డిమాండ్ చేశారు. పేద గిరిజనుల బాధ రాహుల్‌గాంధీకి కనిపిస్తలేదా..? అని నిలదీశారు. లగచర్లపై అర్ధరాత్రి దమనకాండ బిజెపికి కనబడడం లేదా..? అని ప్రశ్నించారు. ఫార్మా సిటీ కోసం తమ ప్రభుత్వ హయాంలో 14 వేల ఎకరాల భూమిని సేకరించామని, తమ హయాంలో ఆ రైతులందరినీ ఒప్పించి భూములను సేకరించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపితే అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు.

రాజ్యసభలో లేవనెత్తుతాం..

త్వరలో లోక్‌సభ సమావేశాలలో రాజ్యసభలో లగచర్ల బాధితుల తరఫున తమ గొంతు వినిపిస్తామని కెటిఆర్ తెలిపారు. పార్లమెంట్లోనూ ఈ విషయం మాట్లాడాలని కోరుతామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కెటిఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బిజెపి రెండు మోసపూరిత పార్టీలే అని, ఆ రెండు పార్టీలను ఓడించాలని జార్ఘండ్, మహారాష్ట్ర ప్రజలను కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఉద్దేశం మాకు లేదని అన్నారు. కాంగ్రెస్ ఐదేళ్లు ఉంటే తాము 15 ఏళ్లు అధికారంలో ఉంటామని చెప్పారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా వాళ్ల ఫ్యామిలీ ప్యాకేజ్‌గా మార్చేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ రైట్ అంటే రేవంత్ రెడ్డి లెఫ్ట్ అనాలనే ఒక పాలసీ పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఢిల్లీకి కావాల్సిన మూటలు అందించగల సత్తా ఉన్నది రాష్ట్రంలో ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే అని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News