Friday, December 27, 2024

సంక్రాంతి నాటికి మొదటి విడతగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు

- Advertisement -
- Advertisement -

సంక్రాంతి పండుగ నాటికి మొదటి విడతగా రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను పేదలకు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామ సహాయం రఘురామరెడ్డి, ఎంఎల్‌ఎ జారే ఆదినారాయణ, నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ మువ్వా విజయబాబుతో కలిసి గురువారం భద్రా్రద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, నాచారం, గున్నేపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాలను ఆయన ప్రారంభించారు. దమ్మపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నమూనా భవనానికి శంకుస్థాపన చేసి, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి ఇండ్లు నిర్మిస్తామని, ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇండ్లు కట్టి తీరుతామని స్పష్టం చేశారు. 10 ఏళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఆ పార్టీ నాయకులు కేవలం మాటలకే పరిమితమయ్యారు తప్ప, ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించిన కాంగ్రెస్ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించి తీరుతామని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 85 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారికోసం ప్రత్యేక యాప్ ద్వారా సమాచారం సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిరంతర ప్రక్రియ అని, ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు అందిస్తామని అన్నారు.

జర్నలిస్టులను ఆదుకుంటాం…
రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులను ఆదుకుంటామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జర్నలిస్టులు పైకి మంచిగానే కనపడుతున్నప్పటికీ, వారికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు మొదటి విడతలోనే వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు అందించాలి…
ప్రతి నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని అన్నారని తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో, ఇక్కడ ఎంతోమంది నిరుపేదలు ఉన్నారని, అశ్వారావుపేట నియోజకవర్గానికి ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఎంఎల్‌ఎ జారే ఆదినారాయణ మంత్రిని కోరారు. మంత్రి స్పందిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఇన్‌ఛార్జి ఆర్‌డిఓ కాషయ్య, దమ్మపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ వాసం రాణి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News