బిజెపిపై అఖిలేష్ వ్యంగ్యాస్త్రాలు
లక్నో: సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గురువారం బిజెపిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కశ్మీరీ పండిట్లపై ”కశ్మీర్ ఫైల్స్” అనే సినిమాను నిర్మించారు కాబట్టి ”లఖింపూర్ ఫైల్స్” అనే సినిమాను కూడా నిర్మించాల్సిన అవసరం ఉందని అఖిలేష్ వ్యాఖ్యానించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్టూ ఆందోళన చేస్తున్న రైతులపై 2021 అక్టోబర్ 3న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు నడిపిన జీపు దూసుకెళ్లి నలుగురు రైతులు మరణించినట్లు కేసు నమోదైంది. 1990 దశకంలో కశ్మీరు నుంచి కశ్మీరీ పండిట్ల వలసలపై నిర్మించిన కశ్మీర్ ఫైల్స్ చిత్రం గురించి బుధవారం సీతాపూర్ జిల్లాలో విలేకరులు వేసిన ప్రశ్నకు అఖిలేష్ జవాబిస్తూ రైతులను జీపు కింద చంపిన లఖింపూర్ ఫైల్స్ కూడా తీయాల్సిందేనని చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నైతిక విజయాన్ని సాధించిందని, బిజెపి క్షీణిస్తుండగా సమాజ్‌వాది ఉదయిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.