బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగులు, లగ్జరీ కారు యజమానులతోపాటు అనేక మంది సంపన్నులు బిపిఎల్ కార్డులు(తెల్ల రేషన్ కార్డులు) అక్రమంగా అనుభవిస్తున్నట్లు కర్నాటకలో బట్టబయలైంది. ఆహార, పౌరసరఫరాలు, వినిమయ వ్యవహారాల శాఖకు చెందిన విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ గత రెండేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించగా ఈ బాగోతం బయటపడింది. 2021 జనవరిలో ప్రారంభమైన ఈ తనిఖీల ద్వారా 17,521 మంది ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రూ. 11 కోట్లు జరిమానాలుగా వసూలు చేసినట్లు ఆ శాఖ అదనపు డైరెక్టర్ జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ తెలిపారు.
Also Read: కన్న కూతురిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి
రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫోర్ వీలర్ల యజమానులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ఆయాయం పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే వ్యక్తి కుటుంబాలు, స్థానిక సంస్థలు, ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలలో పనిచేసే ఉద్యోగుల కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాలలో3 హెక్టార్ల భూమి ఉన్న కుటుంబాలు, రూ. 1.2 లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్న కుటుంబాలు బిపిఎల్ కార్డులకు అనర్హులు. తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను వారి ఆధార్ వివరాలతో కలిపి తనిఖీ చేయగా అనేక విషయాలు బయటపడ్డాయి. అక్రమంగా తెల్లరేషన్ కార్డులు పొందిన ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారికి జరిమానా విధించడంతోపాటు వారి కార్డులను వాపసు చేయవలసిందిగా ఆదేశించినట్లు ఆయన చెప్పారు. మొత్తం 1.21 లక్షల కుటుంబాలు అక్రమంగా తెల్లరేషన్ కార్డులు సంపాదించినట్లు బయటపడిందని, వీరిందరి నుంచి జరిమానా వూసూలు చేసి వారి కార్డులను వాపసు తీసుకున్నామని ఆయన చెప్పారు.