గజ్వేల్: మల్లన్న సాగర్ ముప్పు గ్రామం ఆర్‌అండ్‌ఆర్ కాలనీ లక్ష్మాపూర్ బాధితులకు నాలుగేళ్లు గడుస్తున్నా వారికి ఇంకా పరిహారం అందలేదు. దీనికి తోడు ఇదే అదును భావించి బాధితుల దగ్గర గ్రామ పాలకులు వారికి పరిహారం ఇప్పించేందుకు డబ్బులు వసూలు చేశారు. సరైన అర్హులను ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించకుండా వారికి వచ్చే పరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తూ బాధితులను ఇబ్బందులకు గురిచేసింది. అయితే విషయంపై గ్రామ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ తిగుళ్ల్ల ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామంలోని సరైన ప్యాకేజీల రావడం లేదని బాధితులు తన వద్ద వాపోయారని తెలిపారు. పరిహారం బాధితులు 18 ప్లస్ ప్యాకేజీలు, ఒంటరి మహిళ ప్యాకేజీ, 18 ప్లస్ ప్యాకేజీ ఫ్లాట్లు దాదాపు 30పైచిలుకు వరకు గ్రామంలోని నిర్వాసితులకు రావాల్సి ఉందని పేర్కొన్నారు.
గ్రామ పాలకుడు బాధితుల దగ్గర ఫ్లాట్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అందులో భాగంగానే గ్రామసభలో పోకల కృష్ణయ్య గతంలో సర్పంచ్‌కు తన తల్లి ఇల్లు ప్యాకేజీ కోసం 18,000 వేల రూపాయలు ఇస్తే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానని అని డబ్బులు తీసుకున్నాడని గ్రామ సభలో వాపోయాడని ప్రభాకర్ తెలిపారు. మూడు సంవత్సరాలు గడిచినా ఫ్లాటు రాలేదని దీనిపై గట్టిగా నిలదీస్తే నాతో కాదని డబ్బులు తిరిగి ఇచ్చాడన్నారు. ఇలా అనేక మంది దగ్గర డబ్బులు ఇలాగే వసూలు చేశాడని అని గ్రామ సర్పంచ్ మీద ఆరోపణలు ఉన్నాయన్నారు. కొందరు తనకు వచ్చే ప్యాకేజీలు ఇంకా ఉండటంతో బయటకు చెప్పలేకపోతున్నారన్నారు. కొందరు బాధితులు మాత్రం నా వద్దకు వచ్చి వారికి రావాల్సిన పరిహారం గురించి వారికి జరిగిన అన్యాయం గురించి వివరించారని తెలిపారు.
దీనిపై ప్రభుత్వం, అధికారులకు ఈ సమస్యలు తెలియజేస్తానని వారికి రావాల్సిన వాటి గురించి వివరించి వచ్చేలా ప్రయత్నం చేస్తానని డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే గ్రామ సభల్లో వారి సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బులు ఇప్పించేలా, అవినీతి చేసిన అధికారులను, నాయకులకు శిక్ష పడేలా చేయాలి అని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.