షాద్‌నగర్: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలని వైఎస్‌ఆర్‌టిపి షాద్‌నగర్ కోఆర్డినేటర్ మహ్మద్ ఇబ్రహీం ప్రశ్నించారు. ఆదివారం షాద్‌నగర్‌లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ జలగోస కవిసభ కరపత్రాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ దక్షణ తెలంగాణ ప్రాంతంపై ముఖ్యమంత్రి కెసిఆర్ చిన్న చూపు చూడటమే కాకుండా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించి సాగునీరు, తాగునీరు అందిస్తామని చెప్పి నేడు విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎంపిగా ఉండి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించి దక్షణ తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చి నేడు విస్మరించారని ఆరోపించారు.
2018ఎన్నికల్లో సైతం ఇదే హామీ మళ్లీ విస్మరించారని, వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పేంచేందుకు ఈ ప్రాంత ప్రజలు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. నూతన సచివాలయంలో పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని సమీక్షించినప్పుడు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ విషయం ప్రస్తావనకే రాలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో అనేక మార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ఫలితం లేకుండా పోయిందని, పాలకులను ఎక్కడికక్కడే ప్రశ్నిస్తే సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయని వివరించారు. ఈ ప్రాంతంలో చుక్కనీరు రాకున్న ఎన్నో రంగాలలో వెనుకబడి ఉన్న అభివృద్ది పేరు మీద ప్రభుత్వం కవి సమ్మేళనం చేస్తుంటే దానికి నిరసనగా షాద్‌నగర్‌లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ జలగోస అనే దిక్కార కవి సభను ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో 22వ తేదిన నిర్వహించనున్నట్లు తెలిపారు
. ఈ సమావేశానికి కవులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అర్జునప్ప, పాలమూరు అధ్యాయన వేధిక జిల్లా కన్వీనర్ కె.రవీంద్రనాథ్, జిల్లా కోకన్వీర్ నర్సింలు, టిఎస్‌యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి శివారెడ్డిలతోపాటు వైఎస్‌ఆర్‌టిపి నేతలు పాల్గొన్నారు.