Monday, December 23, 2024

హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Lakshmipathy arrested in Hash Oil case

మనతెలంగాణ/హైదరాబాద్: హాష్ ఆయిల్ కేసులో కీలక నిందితుడు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీపతి హైదరాబాద్ నార్కోటిక్ నియంత్రణ విభాగం పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో హాష్ ఆయిల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఎవరెవరికి సరఫరా చేస్తున్నారనే విషయాలను నార్కోటిక్ విభాగం పోలీసులు సేకరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలోని నల్లకుంట్లకు చెందిన ఓ బిటెక్ విద్యార్థి మాదకద్రవ్యాలకు బానిసై మృతి చెందిన విషయం విదితమే. బిటెక్ విద్యార్థికి మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన ప్రేమ్‌ఉపాద్యాయ్‌తో పాటు ముగ్గురు వినియోగదారులను వారం క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా ప్రేమ్ ఉపాద్యాయ్‌కు హాష్ ఆయిల్‌ను లక్ష్మీపతి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న లక్ష్మీపతి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించారు. వైజాగ్, విజయవాడ, బెంగళూర్, గోవాకు బృందాలుగా వెళ్లి గాలించారు. లక్ష్మీపతి బిటెక్ చదువుతున్న సమయంలో గంజాయికి బానిసయ్యాడు. ఆ తర్వాత గంజాయి విక్రయించడం మొదలు పెట్టాడని పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో సులువుగా డబ్బు సంపాదించేందుకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు హాష్ ఆయిల్ సరఫరా చేయడం ప్రారంభించారు. దాదాపు 100 మంది వరకు లక్ష్మీపతి నుంచి హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఐసో ఫ్రొఫైల్ ఆల్కహాల్‌లో గంజాయి మొగ్గలను మరిగించి దాని ద్వారా వచ్చే ద్రావణాన్ని లక్ష్మీపతి విక్రయాలతో సరఫరా చేస్తున్నట్లు తేలింది. కాగా లీటర్ హాష్ ఆయిల్‌ను రూ. 6 లక్షల వరకు విక్రయిస్తున్నాడు.

10 మి.లీటర్లను చిన్న సీసాలో నింపి వాటిని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వివరిస్తున్నారు. నగరంలోని మాదాపూర్, కొండాపూర్, నార్సింగ్ ప్రాంతాల్లో గదులను అద్దెకు తీసుకొని అక్కడ పార్టీలు ఏర్పాటు చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగులను ఆహ్వానిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్, స్నాప్ చార్ట్, ఇన్‌స్టా గ్రాం, టెలిగ్రాం, వీ-చాట్‌లో గ్రూపులు ఏర్పాటు చేసి డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన సమాచారాన్ని లక్ష్మీపతి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్మీపతి హాష్ ఆయిల్, ప్రేమ్ ఉపాద్యాయ్ ఎల్‌ఎస్‌డి, ఎక్‌టసి టాబ్లెట్లను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదిలావుండగా డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు లక్ష్మీపతికి హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాను గుర్తించేందుకు నార్కోటిక్ నియంత్రణ విభాగం సమాయత్తమౌతోంది.

ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్‌లో లక్ష్మీపతిపై కేసులు నమోదు కావడంతో ఆయా కేసుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. లక్ష్మీపతికి హైదరాబాద్‌లో భారీ నెట్‌వర్క్ ఉందని, గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఏడేళ్లుగా గంజాయికి బానిసైన లక్ష్మీపతి స్టూడెంట్ దశలోనే గంజాయికి అలవాటు పడటంతో పాటు విక్రయాలు సైతం జరిపినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఎపిలోని ఏజెన్సీ నుంచి హాష్ ఆయిల్‌ను హైదరాబాద్‌కు తరలించి విక్రయాలు జరిపేవాడని, అక్కడ లక్ష రూపాయలకు లీటర్ హాష్ ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో లీటర్ రూ.8 లక్షలకు అమ్మేవాడని పోలీసుల విచారణలో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News