ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ
బర్మింగ్‌హామ్: భారత యువ షట్లర్ లక్షసేన్ ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన మూడో భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రకాశ్ పడుకొనే, పుల్లెల గోపీచంద్ మాత్రమే ఫైనల్‌కు చేరారు. తాజాగా లక్షసేన్ కూడా వీరి సరసన చేరాడు. శనివారం నువ్వానేనా అన్నట్టు సాగిన సెమీఫైనల్లో లక్షసేన్ డిఫెండింగ్ చాంపియన్ లీ జి జియా (మలేసియా)ను ఓడించాడు. ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో లక్షసేన్ 2113, 1221, 2119 తేడాతో జయభేరి మోగించాడు. ఆరంభ సెట్‌లో లక్షసేన్ ఆధిపత్యం చెలాయించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగాడు. అతని ధాటికి ప్రత్యర్థి ఆటగాడు ఎదురు నిలువలేక పోయాడు. దూకుడుగా ఆడిన లక్షసేన్ అలవోకగా సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ రెండో గేమ్‌లో మలేసియా షట్లర్ లీ పుంజుకున్నాడు. తన మార్క్ షాట్లతో లక్షసేన్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. దూకుడైన ఆటతో ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా పోరు ఆసక్తికరంగా సాగింది. ఓ దశలో మలేసియా ఆటగాడు స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కానీ పట్టువిడవకుండా పోరాడిన భారత స్టార్ మళ్లీ పుంజుకున్నాడు. ప్రత్యర్థిని మట్టికరిపిస్తూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి టైటిల్ పోరుకు చేరుకున్నాడు.