న్యూఢిల్లీ: పార్లమెంటులో అలజడికి సంబంధించి ఇప్పటికే అయిదుగురిని అరెస్టు చేయగా.. కీలక నింతుడిగా భావిస్తున్న లలిత్ ఝా గురువారం రాత్రి పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇదే సమయంలో వీరితో సంబంధం ఉన్న రాజస్థాన్‌కు చెందిన మహేశ్, కైలాష్ అనే మరో ఇద్దరు నిందితులను కూడా ఢిల్లీ పోలీసు విభాగానికిచెందిన స్పెషల్ సెల్ అరెస్టు చేసింది. లలిత్ ఝాతో పాటుగా వీరిద్దరినీ విడివిడిగా విచారించిన పోలీసులకు ఓ ఆసక్తికరమైన విషయం తెలియవచ్చింది. పార్లమెంటులో అలజడి సృష్టించేందుకు తాము పన్నిన అసలు ప్లాన్ ఏదయినా కారణం చేత విఫలమైతే..ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నట్లు వెల్లడయింది. అసలు ప్లాన్ ప్రకారం ఒక వేళ ఏదయినా కారణం చేత అమోల్, నీలంలు పార్లమెంటు సమీపానికి చేరుకోలేక పోతే మహేశ్, కైలాష్‌లు మరో మార్గంనుంచి పార్లమెంటుకు చేరుకుని మీడియా కెమెరాల ముందు కలర్ బాంబులు పేల్చి నినాదాలు చేసేలా ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఝా పోలీసులకు వివరించాడు.
అయితే మహేశ్, కైలాష్‌లు గుర్గావ్‌లో తాము ఉంటున్న విశాల్ శర్మ అలియాస్ విక్కీ నివాసానికి చేరుకోకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా తమకు అప్పగించిన పనిని పూర్తి చేయాలని అమోల్, నీలమ్‌లను ఆదేశించినట్లు కూడా లలిత్ ఝా పోలీసులకు వెల్లడించాడు. అంతేకాకుండా ఈ పని తర్వాత తాను దాగి ఉండేందుకు కూడా లలిత్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాను రాజస్థాన్‌లో దాక్కోవడానికి సాయం చేసే బాధ్యతను మహేశ్‌కు అప్పగించాడు.దీంతో మహేశ్ తన ఐడెంటిటీ కార్డును ఉపయోగించి గెస్ట్‌హౌస్‌లో లలిత్‌కు వసతి ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి టీవీలో వస్తున్న సమాచారాన్ని లలిత్, మహేశ్, కైలాష్‌లు ఎప్పటికప్పుడు సేకరిస్తూ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఆధారాలను నాశనం చేసేందుకు నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లను లలిత్ తగులబెట్టినట్లు కూడా ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.