Tuesday, November 5, 2024

లాలూను వీడని దాణా కుంభకోణం

- Advertisement -
- Advertisement -
Lalu Convicted In 5th Fodder Scam Case
అయిదో కేసులోనూ దోషిగా ప్రకటన

రాంచి: దాణా (పశుగ్రాసం)కుంభకోణం ఆర్‌జెడి అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ను విడిచి పెట్టడం లేదు. తాజాగా ఈ కుంభకోణానికి సంబంధించిన మరో కేసులో రాంచీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూప్రసాద్‌ను దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఈ మొత్తం కేసు 1990, 1995 మధ్య కాలంలో డొరాండా ట్రెజరీనుంచి రూ.139.35 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేయడంపై ఉంది. ఇది దాణా కుంభకోణంలో అయిదో కేసు మాత్రమే కాక అతిపెద్ద కేసు కూడా. తాజా తీర్పుతో పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించి మొత్తం అయిదు కేసుల్లోను లాలూ దోషిగా నిలిచారు. గత నెల 29న ఈ కేసులో విచారణను ముగించిన కోర్టు ఈ రోజు తీర్పు ప్రకటించింది.ఈ నెల 18న శిక్షలను ప్రకటించనున్నట్లు సిబిఐ తరఫు న్యాయవాది చెప్పారు. తీర్పు సందర్భంగా లాలూ ప్రసాద్ రాంచీ కోర్టుకు హాజరయ్యారు. సిబిఐ జడి ఎస్‌కె శశి తీర్పు వెలువరించారు.

ఈ కేసులో మిగతా 98 మంది నిందితులు కూడా కోర్టుకు హాజరు కాగా, వీరిలో 24 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. మిగతా వారిలో 35 మందికి మూడేళ్ల జైల్లు శిక్ష విధించింది. వీరిలో మాజీ ఎంపి జగదీశ్ శర్మ, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ధ్రువ్ భగత్, పశు సంవర్ధకశాఖ కార్యదర్శి బెక్ జులియస్ తదితరులున్నారు. కాగా దాణా కుంభకోణానికి సంబంధించి నాలుగు కేసుల్లో లాలూ ఇప్పటికే దోషిగా నిర్ధారణ అయ్యారు. అవిభక్త బీహార్‌లోని వివిధ జిలాల్ల ట్రెజరీలనుంచి రూ.950 కోట్ల నిధుల అక్రమంగా విత్‌డ్రా చేయడానికి సంబంధించి ఈ కేసులు దాఖలయ్యాయి. నాలుగు కేసుల్లో లాలూ దోషిగా నిర్ధారణ కాగా మొత్తం 14 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. లాలూ గతంలో ఈ నాలుగు కేసులను సవాలు చేశారు. అయిదో కేసును కూడా సవాలు చేసే అవకాశం ఉంది. డుమ్కా, దేవ్‌ఘర్, చైబాసా ట్రెజరీలనుంచి అక్రమంగా నిధుల విడుదలకు సంబంధించిన నాలుగు కేసుల్లో బెయిల్ పొందిన లాలూ ప్రస్తుతం జైలు బయట ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News