ఎల్‌జెపి నేత చిరాగ్‌పాశ్వాన్ పట్ల సానుకూల వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్, జెడి(యు) మాజీ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌తో భేటీ అయ్యారు. సోషలిస్ట్ నేతలైన ములాయం, శరద్‌యాదవ్, తనలాంటివారు పార్లమెంట్‌లో లేకపోవడం వల్ల ప్రజా సమస్యలు చర్చకు రావడంలేదని లాలూ అన్నారు. అయితే, ప్రస్తుత లోక్‌సభలో ములాయం సభ్యుడన్నది గమనార్హం. ఎల్‌జెపిలో నెలకొన్న ఆధిపత్య పోరుపై మాట్లాడుతూ చిరాగ్‌పాశ్వాన్‌ను లాలూ సమర్థించారు. ఎల్‌జెపి వ్యవస్థాపకుడు రామ్‌విలాస్‌పాశ్వాన్ మరణానంతరం ఆయన కుమారుడు చిరాగ్‌కూ, సోదరుడు పశుపతికుమార్‌పరాస్‌కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
ప్రస్తుతం బీహార్ క్రియాశీలక రాజకీయాల్లో ఆర్‌జెడి వ్యవహారాలను లాలూ తన కుమారుడు తేజస్వీయాదవ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. చిరాగ్ నేతృత్వంలోని ఎల్‌జెపిని ఆర్‌జెడి నేతృత్వంలోని కూటమిలో చేర్చుకునే దిశగా లాలూ సంకేతాలిచ్చారు. పరాస్ నేతృత్వంలోని ఎల్‌జెపి, బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీకున్న ఐదుగురు ఎంపీల మద్దతు పరాస్‌కున్నది. పరాస్‌తోపాటు చిరాగ్ కూడా లోక్‌సభకు ఎన్నికయ్యారు. పరాస్ ఇటీవలే కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకున్నారు.