పాట్నా : ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం బీహార్ ముఖ్యమంత్రి, జెడి (యు) అధినేత నితీశ్ కుమార్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. లాలూ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆ సమావేశం అనంతరం తమ నివాసానికి తిరిగి వచ్చిన తరువాత జర్నలిస్టులతో కొద్ది సేపు మాట్లాడారు. నితీశ్‌తో విభేదాలు అన్నవి ‘వాస్తవానికి సత్యదూరమైనవి’ అని తేజస్వి అన్నారు. ‘ఏమాత్రం వాస్తవం కాని అంశాలపై మీరు ప్రశ్నలు అడిగినప్పుడు నాకు విచారం కలుగుతుంటుంది.
మహాఘట్‌బంధన్‌లో సీట్ల పంపిణీ ఖరారు కానున్న సమయంలో ఎందుకు అంత ఆసక్తి కనబరుస్తుంటారు ? బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ తమ శిబిరంలో విభేదాలను పరిష్కరించుకుందా ?’ అని తేజస్వి అన్నారు. కాగా, మహాఘట్‌బంధన్‌లో కొత్తగా చేరిన జెడి (యు) నేతలు సీట్ల పంపిణీ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కుడుర్చుకోవాలని కోరుతున్నారు. ఆ సూచనను ఆర్‌జెడి అధినేత రెండు రోజుల క్రితం తిరస్కరించారు. ఎన్‌డిఎ భాగస్వామిగా 2019 లోక్‌సభ ఎన్నికలలో తాను పోటీ చేసి 16 సీట్లు గెలుచుకున్న జెడి (యు) ఈ దఫా ఆ సంఖ్య కన్నా తక్కువ సీట్ల ఒప్పుకోవడం లేదు.
అయితే గతంలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేని ఆర్‌జెడి అసెంబ్లీలో తమ సంఖ్యా బలాన్ని బట్టి సింహ భాగం సీట్ల కోసం పట్టుబట్టుతోంది. ఇది ఇలా ఉండగా, ఇడి దృష్టిలో ఉన్న, ఆ సంస్థ నుంచి ఒకటికి మించి సమన్లు అందుకున్న తేజస్వి ‘మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ప్రజల కోసం పని చేసే అజెండా నుంచి దృష్టి మళ్లించబోం. ఆర్‌జెడి, జెడ (యు) సంఘటితంగా ఉన్నాయి. బిజెపిని ఓడించేందుకు అవి సంయుక్తంగా లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తాయి’ అని చెప్పారు.