న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్ (72) ఆరోగ్యం క్షీణించింది. దీంతో శనివారం ఢిల్లీ లోని ఎయిమ్స్‌కు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ రాంచీ లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఆర్‌ఐఎంఎస్) ఆస్పత్రిలో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ రావడంతో గత మూడు రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. శుక్రవారం ఆయనకు న్యుమోనియా సోకిందని, మెరుగైన చికిత్స కోసం డాక్టర్ల సలహాపై ఢిల్లీ లోని ఎయిమ్స్‌కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించడానికి నిర్ణయించామని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్ చెప్పారు.
ఎనిమిది మంది డాక్టర్లుతో కూడిన మెడికల్ బోర్డు లాలూను పరీక్షిస్తున్నారు. లాలూ కిడ్నీలు ప్రస్తుతం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని డాక్టర్లు చెప్పారు. ఢిల్లీకి లాలూను తరలించడానికి సిబిఐ కోర్టు నుంచి జైలు అధికారులు అనుమతి పొందాల్సి ఉంది. శుక్రవారం లాలూ భార్య రబ్రీదేవి, కుమార్తె భారతి, కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి రాంచీకి చేరుకుని లాలూను పరామర్శించారు. . ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను తేజస్వి కలుసుకుని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించడానికి సహకరించాల్సిందిగా కోరారు. మరోవైపు అనారోగ్య పరిస్థితుల కారణంగా లాలూకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు పాట్నాహైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది.