Wednesday, January 22, 2025

బహుజన యోధుడు

- Advertisement -
- Advertisement -

ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ యాత్రను అడ్డుకొని 1990వ దశకం ఆరంభంలో ‘హిందూత్వ’ రాజకీయాలను కొంతమేరకు నిలువరించారు. దాదాపు ఇదే సమయంలో (1990)లో మండల్ కమిషన్ సిఫారసులు అమలు పరుస్తూ అప్పటి దేశ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ విద్య, ఉద్యోగాల్లో ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆగస్టు 7 లోక్‌సభలో ప్రకటన కూడా చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, మీడియా, ఆధిపత్య కుల సంఘాలు, బిజెపి, దాని అనుబంధ విద్యార్థి సంఘం నిరసనలు వ్యక్తం చేశాయి. పలు రాష్ట్రాల్లో ఈ వ్యతిరేక ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి.

ఈ సమయంలో వి.పి. సింగ్‌కు కొండంత అండగా నిలబడడమే గాకుండా ఢిల్లీ కేంద్రంగా బహుజన విద్యార్థులను సమీకరించి కౌంటర్ ఉద్యమానికి తెర లేపింది, మీడియా కుట్రలను బలంగా ఎదుర్కొని ప్రజలను చైతన్య పరచడంలో ముందున్నది శరద్ యాదవ్. సోషలిస్టు నాయకుడిగా, లోహియావాదిగా, కేంద్ర మంత్రిగా, సీనియర్ పార్లమెంటేరియన్‌గా, జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిండు. 1990లో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిని చేయడంలోనూ ఈయన పాత్ర కీలకమైనది. అప్పటికే జనతాదళ్‌ల్‌లో దేవిలాల్ తర్వాత రెండో స్థానంలో శరద్‌యాదవ్ ఉండేవారు. దాంతో ఢిల్లీ నేతలను ఒప్పించి లాలూని ముఖ్యమంత్రిని చేసిండు. అట్లాగే ఇటీవలి కాలంలో బిజెపికి వ్యతిరేకంగా మహా ఘట్‌బంధన్ ఏర్పాటు చేసి లాలూ యాదవ్, డి.రాజా, మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, గులాం నబీ అజాద్ తదితర రాజకీయ యోధులందరినీ ఒకే వేదిక మీదికి తీసుకొచ్చి రాజకీయ పోరాటం చేసిండు. జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడి గా బీహార్ రాజకీయాల్లో దిగ్గజాలైన లాలూప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్‌ల మధ్యన సయోధ్య కుదిర్చి రాజనీతిజ్ఞతను ప్రదర్శించిండు. లాలూని ఒప్పించి 2015లో నితీశ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంలో శరద్ యాదవ్ కీలక భూమిక పోషించిండు.

2017 జులైలో లాలూ ప్రసాద్ యాదవ్‌తో తెగతెంపులు చేసుకొని నితీశ్ కుమార్ బిజెపి మద్ధతుతో ముఖ్యమంత్రి పదవి స్వీకరించిండు. ఇందులో అరుణ్‌జైట్లి, వెంకయ్యనాయుడు ప్రముఖ పాత్ర పోషించిండ్రు. ఇదే సమయంలో శరద్ యాదవ్‌కు కేంద్ర మంత్రిపదవి ఇస్తాము తమతో కలిసి రావాలని బిజెపి నాయకులు కోరిండ్రు. దీనికి శరద్ యాదవ్ సమాధానమిస్తూ “వాజ్‌పేయి, అడ్వానీ శకం ముగిసింది. మోడీ, అమిత్ షా భిన్నమైన వ్యక్తులు. ఎన్‌ఆర్‌సి, సిఎఎ, ఎన్‌పిఆర్ ఉద్యమాల ద్వారా ఇది నిరూపితమయింది కూడా. జాతీయ వాదం పేరిట విభజన ఎజెండాను అమలు పరుస్తున్నారు” అని తన నిరసనను శరద్ యాదవ్ ప్రకటించాడు. ఈ విషయం ఇటీవల ప్రచురితమైన “జెపి టు బిజెపి: బీహార్ ఆఫ్టర్ లాలూ అండ్ నితీశ్‌” (పేజి. 16)లో రచయిత సంతోష్ సింగ్ వివరంగా పేర్కొన్నాడు. అంతేగాదు గాంధీని హత్య చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆమోదనీయత రావడంలో జయప్రకాశ్ నారాయణ (జెపి) పాత్ర కూడా ఉన్నదన్నాడు.

1974లో సంపూర్ణ క్రాంతి ఉద్యమం తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసిన ఒక క్యాంపుకు హాజరు కావాలని జయప్రకాశ్ నారాయణ నిర్ణయించుకున్నాడు. అట్లా పోవడం వల్ల స్వాతంత్య్ర సిద్ధించిన కాలం నుండి ఆ సంస్థ పట్ల జెపి వ్యవహరించిన తీరుకు ఇది భంగకరమైంది. దీంతో ఆ క్యాంప్‌కు హాజరు కావొద్దని శరద్ యాదవ్ కోరిండు. అయినప్పటికీ జెపి క్యాంప్‌లో పాల్గొన్నాడు. ప్రతిపక్షాల సంఘటితం పేరిట తాను వారిస్తున్నా జెపి జనసంఘ్ వారిని కూడా కలుపుకు పోయిండనీ, అది తర్వాతి కాలంలో ఆ పార్టీ రాజకీయంగా నిలబడడానికి, ఆమోదనీయత పొందడానికి దోహదపడిందని శరద్ యాదవ్ అభిప్రాయపడ్డాడు. ఈ మాటలు ప్రస్తుత తరుణంలో అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయి.

శరద్ యాదవ్ 1974లో మొదటిసారిగా జబల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి జయప్రకాశ్ నారాయణ అంతే వాసిగా అందరి మన్ననలందుకున్నారు. సోషలిస్టు నాయకులు మధు దండావతె, మధు లిమాయెలతో కలిసి వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నారు. అయితే 1975లో ఎమర్జెన్సీ విధించడంతో ఆయన పదవీ కాలంలో ఏడాదిలోపే ముగిసింది. ఆ తర్వాత 1977, 1989, 1991, 1996, 1999, 2009 ఎన్నికల్లో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యిండు. అట్లాగే 1986, 2004లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1989లో వి.పి.సింగ్ ప్రభుత్వంలో టెక్స్‌టైల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఎన్‌డిఎ ప్రభుత్వలో 19992004 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2012లో బెస్ట్ పార్లమెంటేరియన్‌గా ఎన్నికయ్యారు.

సోషలిజవ్‌ు, లౌకికవాదం, ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి, పీడిత వర్గాల అభ్యున్నతి కోసం జీవితమంతా పోరాటం చేసిన శరద్ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ పట్టణానికి సమీపంలోని బాబే అనే గ్రామంలో జూలై 1, 1947 నాడు జన్మించాడు. ఈయన తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఒక మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడగా అందులో దూకి ఆమెను కాపాడిన సాహసం శరద్ యాదవ్‌ది. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ప్రొఫెసర్‌గా పని చేసిన విజయ్ దేవనారాయణ్ షాహి ప్రభావంతో సోషలిస్టు ఉద్యమంలోకి వచ్చిన శరద్ యాదవ్ విద్యార్థి ఉద్యమంలో ముందువరుసలో ఉన్నందుకు 1971లో ‘మీసా’ క్రింద అరెస్టయిండు. ఆనాటి నుంచి ప్రజా ఉద్యమాల్లో ముందుండి ప్రజాస్వామ్య, సోషలిజవ్‌ు, సెక్యులరిజవ్‌ు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహరహం శ్రమించిన శరద్ యాదవ్ జనవరి 12న కన్ను మూశారు. నిరంతరం బహుజన ఉద్యమాలకు బాసటగా నిలిచిన ఆ యోధుడికి అశ్రు నివాళి.

సంగిశెట్టి శ్రీనివాస్
9849220321

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News