బీహార్‌లో కూటమి సీట్ల లెక్క తేలడం లేదు. భాగస్వామ్య పక్షాల మధ్య ఒప్పందం కొలిక్కి రాకముందే రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ ) తన అభ్యర్థులను ప్రకటించింది. కొందరికి టికెట్లను కూడా అందజేసింది. దీంతో అక్కడ కూటమి పోటీ చేసే స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి మరో ఆఫర్ ఇచ్చారు. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీకి 9 లోక్‌సభ సీట్లు ఇస్తామని లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇచ్చారు. కిషన్‌గంజ్, కతియార్, ససారం, పాట్నా సహిబ్ , బేటియా, ముజఫర్ నగర్, సమస్తిపూర్, భాగల్‌పూర్, మధేపుర లేదంటే సుపౌల్ సీటును ఇస్తామని ప్రకటించారు. ఈ లోక్‌సభ సీట్లు ఇవ్వాలంటే లాలూప్రసాద్ కాంగ్రెస్‌కు షరతు విధించారు.
కాంగ్రెస్‌కు బీహార్‌లో 9 సీట్లు ఇస్తే, పక్కనే గల ఝార్ఖండ్‌లో తమ పార్టీకి రెండు సీట్లు ఇవ్వాలని లాలూ ప్రసాద్ యాదవ్ మెలిక పెట్టారు. ఝార్ఖండ్‌లో ఛాత్ర, పాలము లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని ఆర్జేడీ ఆసక్తి చూపిస్తోంది. కాదు కూడదని కాంగ్రెస్ బెట్టు చేస్తే బీహార్‌లో కాంగ్రెస్‌కు ఆరు నుంచి ఏడు సీట్లు మాత్రమే కేటాయిస్తామని లాలు తేల్చి చెప్పారు. అయితే బీహార్‌లో పూర్ణియా లోక్‌సభ స్థానంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ సీటును ఇటీవల పార్టీలో చేరిన పప్పుయాదవ్‌కు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇంతలో భీమా భారతిని ఆర్జేడీ బరిలోకి దింపింది. కూటమిలో ఉంటూ తమ అభిప్రాయానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గౌరవించడం లేదని కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది.