లాలూ ప్రసాద్ వెల్లడి
పాట్నా: దేశంలో 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్షాలను సంఘటితం చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలసి తాను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని త్వరలోనే కలుస్తానని ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను దాచేందుకు సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీయాలని బిజెపి భావిస్తోందని గురువారం ఆర్‌జెడి రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ప్రసంగిస్తూ లాలూ ఆరోపించారు. ఢిల్లీలో సోనియా గాంధీని తాను, నితీశ్ కుమార్ కలుస్తామని, రాహుల్ గాంధీని కూడా ఆయన పాదయాత్ర ముగిసిన తర్వాత కలుస్తామని లాలూ చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షం బిజెపిని అధికారం నుంచి పెకిలించి పారేస్తుందని ఆయన అన్నారు. త్వరలో బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జరపనున్న పర్యటనపై స్పందిస్తూ ప్రజలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ప్రజల మధ్య గొడవలు సృష్టించడానికి బిజెపి నాయకులు ప్రయత్నించవచ్చని ఆయన హెచ్చరించారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతాన్ని అమిత్ షా ఈ నెల 23, 24 తేదీలలో సందర్శించనున్నార. పూర్నియా, కిషన్ గంజ్ జిల్లాలలో ఆయన బహిరంగ సభలలో పాల్గొననున్నారు.