పాట్నా: ఆర్‌జెడి అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చాలా ఏళ్ల తర్వాత పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. పశుదాణా కుంభకోణంలో జైలు జీవితాన్ని గడిపి ఇటీవలే విడుదలైన లాలూ మొదటిసారి వర్చువల్ పద్ధతిలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఢిల్లీలోని తన కుమార్తె, ఎంపి మీసా భారతి నివాసం నుంచి పాట్నాలోని పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన లాలూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. తన కుమారుడు తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఆర్‌జెడికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
జనతా పార్టీ నుంచి విడిపోయి 1997లో తాను ఏర్పాటు చేసిన ఆర్‌జెడి రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయన ప్రసంగించారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ చాలా నీరసంగా కనిపించడమే కాక ఆయన ప్రసంగంలో కనిపించే మెరుపులు, చమక్కులు మాయం కావడం గమనార్హం. నోట్ల రద్దు, జిఎస్‌టితోపాటు కరోనా కల్లోలం దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించాయని ఆయన అన్నారు. ఇప్పుడు దేశ సామాజిక స్వరూపాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అయోధ్య వివాదం తర్వాత ఇప్పుడు కొందరు మథుర గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.