Monday, December 23, 2024

లాలూప్రసాద్ కు మరి ఐదేళ్లు జైలు

- Advertisement -
- Advertisement -

Lalu Yadav jailed for another five years in fodder scam

 

పాట్నా :బీహార్ రాష్ట్రంలో సంచలనం కలిగించిన దాణా కుంభకోణంలో దొరండా ఖజానా కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (73)కు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. దీంతోపాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది. ఈ కుంభకోణంలో ఈ కేసు చిట్టచివరిది, అయిదోది . లాలూతోపాటు మరో 99 మంది నిందితులపై రాంచీ లోని న్యాయస్థానం విచారణ జరిపి జనవరి 29 న తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. గత మంగళవారం లాలూను దోషిగా తేల్చింది. మరో 46 మందికి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 24 మందిని నిర్దోషులుగా పేర్కొంది. రూ.950 కోట్ల దాణా కుంభకోణంలో ఇప్పటివరకు నాలుగు కేసుల్లో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పులు వెలువరించింది.

ప్రతి కేసు లోనూ లాలూకు జైలు శిక్ష పడింది. ఈ దొరండా కేసు చివరిది. ఇందులో నకిలీ బిల్లులతో రూ. 139.5 కోట్లను ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా పొందినట్టు రుజువు కావడంతో మొత్తం 170 మందిపై సీబిఐ అభియోగాలను మోపింది. వీరిలో 55 మంది మరణించారు. ఏడుగురు ప్రభుత్వం తరఫున సాక్షులుగా మారగా, ఇద్దరు నేరం అంగీకరించారు. ఆరుగురు పరారీలో ఉన్నారు. చివరకు లాలూ మరో 99 మందిపై సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది.

ఇది రూ.950 కోట్ల దాణా కుంభకోణం… మొత్తం 5 కేసులు నమోదు

బీహార్ ముఖ్యమంత్రిగా లాలూప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు 1990 లో ఈ దాణా కుంభకోణం జరగ్గా 1996 జనవరిలో బయటపడింది. లాలూను నిందితునిగా పేర్కొంటూ 1997 జూన్‌లో సిబిఐ కేసు నమోదు చేసింది. లాలూతోపాటు బీహార్ మాజీ సిఎం జగన్నాథ్ మిశ్రా, మాజీ ఎంపి జగదీశ్ శర్మ, అప్పటి ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ ద్రువ్ భగత్, పశుసంవర్థక శాఖ అధికారులు ,తదితరులపై సిబిఐ అభియోగాలు మోపింది. దుమ్కా, దేవ్‌ఘర్, చాయ్‌బసా ఖజానాల నుంచి నిధులను దుర్వినియోగం చేసినట్టు దాఖలైన నాలుగు కేసుల్లో లాలూ దోషిగానే తేలారు. ఈ కుంభకోణంలో మరో దోషిగా తేలిన బీహార్ మాజీ సిఎం జగన్నాథ్ మిశ్రా 2019 లో మృతి చెందారు.

ఈ కేసుకు బీహార్ సిఎం నితీష్ దూరం…

లాలూ యాదవ్‌కు శిక్ష గురించి అడగ్గా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ యాదవ్ ఈ కేసుకు దూరంగా ఉన్నారు. ఈ కేసు దాఖలైనప్పుడు వారు తన వద్దకు వచ్చారని కూడా చెప్పారు. దాఖలు చేసిన వారిలో కొందరు ఈరోజు లాలూతో ఉన్నారని వ్యాఖ్యానించారు. పిటిషనర్‌గా ఉండడానికి తాను ఒప్పుకోలేదని చెప్పారు.

2017 నుంచి లాలూ జైలు లోనే

2017 డిసెంబర్ నుంచి లాలూ జైలు లోనే ఉన్నారు. ఆ సమయంలో చాలా రోజులు ఝార్ఖండ్ లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్సపొందారు. ఆరోగ్యం క్షీణించడంతో గత ఏడాది జనవరిలో ఆయనను ఢిల్లీకి తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News