Sunday, November 3, 2024

బ్యాడ్మింటన్ ఆడే లాలూకు బెయిల్ ఎ‘లా’?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అనారోగ్య కారణాలతో బెయిల్ పొందిన లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు తీరిగ్గా బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉన్నారని సుప్రీంకోర్టుకు శుక్రవారం సిబిఐ తెలిపింది. పశువుల దాణా స్కామ్ కేసులో లాలూ బెయిల్ పొంది బయటకు వచ్చారు. వైద్య కారణాలు చూపి ఆయన బెయిల్ పొందారని, అయితే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని తెలిపిన సిబిఐ వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు విన్నవించుకుంది. దీనిని లాలూ తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. ఆయనకు ఇటీవలే కిడ్నీ మార్పిడి జరిగిందని, ఆరోగ్య పరిరక్షణకు వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. డోరాండా ట్రెజరీ కేసులో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. సంబంధిత కేసులో ఆయన బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోరింది.

అయితే ఇప్పటికే తమ క్లయింట్ లాలూ ప్రసాద్ కేసుకు సంబంధించి 42 నెలలు జైలులో ఉన్నారని, ఆయనకు రిలీఫ్ కొనసాగాలని లాలూ తరఫు న్యాయవాది సీనియర్ అయిన కపిల్ సిబల్ తెలిపారు. సిబిఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు హాజరయ్యారు. లాలూకు బెయిల్ ఇవ్వడం చట్టప్రకారం అనుచితం, తప్పిదం అని జార్ఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రతిని సుప్రీంకోర్టుకు అందించారు. ఆయన హాయిగా ఆటలాడుకుంటున్నారు. ఆయన చాలా ఏండ్లు జైలులో ఉన్నారనే వాదనను పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇచ్చారని, ఇది తప్పు అని రాజు తెలిపారు. పైగా పలు రాజకీయసభలకు కూడా వెళ్లిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు. ఆయనకు వేర్వేరు కేసులలో పడ్డ శిక్షలను ఏకకాలంలో పడ్డ శిక్షలకాలంతో లెక్కకడితే అది అనుచితం అవుతుందని తెలిపారు. వాదోపవాదాల తరువాత న్యాయమూర్తులు ఎఎస్ బొపన్న, ఎంఎం సుంద్రేష్‌ల ధర్మాసనం కేసు తదుపరి విచారణను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News