Tuesday, December 3, 2024

బ్రిటన్ దివాలీ వేడుకలో మటన్..మందు

- Advertisement -
- Advertisement -

బ్రిటన్‌లో జరిగిన దీపావళి అధికారిక వేడుక వివాదాస్పదం అయింది. అక్టోబర్ 29వ తేదీన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తమ అదికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో బ్రిటిష్ హిందువుల కోసం దివాలీ విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందులో మాంసాహారం, బీరు బ్రాందీ విస్కీ వంటి అల్కహాలు ద్రావకాలు అందరికీ అందించారు. హిందువులు దీపావళి పండుగను పరమ పవిత్రంగా నిర్వహిస్తారు. ప్రత్యేకించి కేవలం తీపి పదార్థాలు, పండ్ల రసాలు తీసుకోవడం ఆనవాయితీ. కానీ ప్రధాని వేడుకలో ఇందుకు విరుద్ధంగా జరిగిందని, తమ విశ్వాసాలను దెబ్బతీశారని బ్రిటన్‌లోని హిందూ సమాజం నిరసన వ్యక్తం చేస్తోంది. పద్ధతి, సాంప్రదాయం పాటించకుండా వేడుక నిర్వహించడం, పిలిచి మరీ ఈ విధంగా వంటకాలు వడ్డించడం అవమానించడమే అని విమర్శలు వెల్లువెత్తాయి. ఆరోజు జరిగిన వేడుకల్లోని దృశ్యాలు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వెలుగులోకి వచ్చాయి.

ఈ పర్వదినానికి ఉన్న పవిత్రత , ఇందులోని పరమార్థం తెలియకుండా చేసిన పని అనుకోవాలా? లేక కావాలనే పిలిచి , హిందువులను గేలిచేసి పంపించడమా? ఏమనుకోవాలని పలువురు నిలదీస్తున్నారు. ప్రధానికి లేదా ప్రధాని అధికార యంత్రాంగానికి సరైన ఆలోచన లేదని అనుకోవల్సి వస్తుందని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. జరిగిన తంతు గురించి హిందువుల వేదిక ఇన్‌సైట్ యుకె స్పందించింది. ఏదైనా అధికారిక కార్యక్రమం జరిగినప్పుడు , ప్రత్యేకించి అధికారిక నివాసాలలో వేడుకల దశలో సంబంధిత ఆచార వ్యవహారాలను బేఖాతరు చేసే విధంగా జరిగితే ఇక దేశంలోని మతపరమైన వర్గాలకు ఏమి భద్రత ఉంటుందని ఇన్‌సైట్ యుకె ప్రశ్నించింది. జరిగిందానిపై ఎక్కువగా వాదించదల్చుకోలేదు. దీని వల్ల ఫలితం కూడా ఉండదు. అయితే ఇకపై జరిగే కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దేశంలోని బహుళ సంస్కృతి పరిరక్షణ అత్యంత కీలకం.

దీనిని కాదంటే దేశ ఘనత దెబ్బతింటుందని హెచ్చరించారు. గౌరవ మర్యాదలను ఆశించే వివిధ వర్గాల మనోభావాలను పాలకులు తెలుసుకుని తీరాల్సిందే అన్నారు. ఇటువంటి సందర్భాలలో జరిగే వేడుకలతో దేశ సంస్కృతి , ప్రత్యేకించి అందరిని మన్నించడం వంటి సదాలోచనలకు పట్టం కట్టడం అవుతుంది. అయితే ఇందుకు భిన్నంగా తంతు సాగించడం దురాచారం అవుతుందని హెచ్చరించారు. ఉద్ధేశపూరితం కాకపోయినా ఇటువంటివి జరగడం దురదృష్టకరం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News