జైషే చీఫ్ మసూద్ బంధువు లంబూ హతం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ సహా ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. హతుడు లంబూ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ బంధువని తెలిసింది. సిఆర్‌పిఎఫ్ జవాన్లపై జరిగిన దాడిలో ఇతని హస్తమున్నట్లు అధికారులు తెలిపారు. పుల్వామాలోని నమిబియన్, మర్సార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు నిఘా వర్గాలనుంచి సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ చేపట్టాయి. భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం కశ్మీర్ ఐజి విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదుల వివరాలు వెల్లడించారు. హతుల్లో ఒకడు జైషే కీలక ఉగ్రవాది లంబూగా గుర్తించినట్లు చెప్పారు.
మరో ఉగ్రవాది వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కాగా లంబూ అలియాస్ మహమ్మద్ ఇస్మాల్ అల్వీ అలియాస్ అద్నన్.. దక్షిణ కశ్మీర్‌లో జైషే అపరేషనల్ కమాండర్‌గా ఉన్నాడు. జైషే ఉగ్రవాద ముఠా అధినేత మసూద్ అజర్ దగ్గరి బంధువు లంబూ అని విజయ్‌కుమార్ చెప్పారు.2017లో భారత్‌లోకి చొరబడిన లంబూ అప్పటినుంచి దక్షిణ కశ్మీర్‌లో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఐఇడి బాంబుల తయారీలో నిపుణుడైన ఇతను 2019లోపుల్వామాలో సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలోను కీలక సూత్రధారి అని ఐజి తెలిపారు. సిఆర్‌పిఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్‌దార్‌తో లంబూ టచ్‌లో ఉన్నాడని, అప్పట్లో వైరల్‌గా మారిన ఆదిల్‌దార్ వీడియోలోను ఇతని గొంతు వినిపించిందని చెప్పారు. పుల్వామా దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్‌ఐఎ) సమర్పించిన చార్జిషీట్‌లోను లంబూ పేరు ఉందని పేర్కొన్నారు.2019 ఫిబ్రవరి 14న సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన భీకర దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే.