హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణ సమస్యగా మారింది. రా్రష్ట్రంలో పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందనున్న రోడ్లను గుర్తించి ఆ ప్రాంతాల్లో జాతీయ రహదారులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో 715 కి.మీ.ల మేర నిడివి గల జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 28,615 కోట్లు వ్యయం అవుతుందని ఆ ప్రతిపాదనల్లో రాష్ట్రం పేర్కొంది. వరంగల్ టు -కరీంనగర్ మధ్య ఎన్‌హెచ్‌ఏఐ -563 పై 68 కి.మీ.ల ఫోర్ లేన్ రోడ్డు ,
తొండుపల్లి- టు కొత్తూరు మధ్య ఎన్‌హెచ్‌ఏఐ 44పై 12 కి.మీ.ల రోడ్డు, కొల్లకల్- టు గుండ్లపోచంపల్లి మధ్య ఎన్‌హెచ్‌ఏఐ 17పై 17 కి.మీ.ల రోడ్డు, జగిత్యాల- టు కరీంనగర్ మధ్య ఎఎన్‌హెచ్‌ఏఐ 563పై 59కి.మీ.ల ఫోర్ లేన్ రోడ్డు, కర్ణాటక సరిహద్దు గుడెబెళ్లూర్ నుంచి జడ్జర్ల వరకు 90 కి.మీ.ల ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణానికి సైతం కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు గతేడాది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో ఈ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పనులు సాగాలని ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు.
నాగ్‌పూర్ టు -విజయవాడ మధ్య…
దీంతో గతేడాది కొన్ని రహదారుల నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మరికొన్ని ప్రాంతాల్లో రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. దీంతో ఈ నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. రైతులు వ్యతిరేకిస్తున్న ప్రాంతాల్లో భూ సేకరణ ప్రభుత్వానికి సమస్యగా మారింది. ఈసమస్యను అధిగమిస్తేనే రా్రష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే, కర్ణాటక సరిహద్దు గుడెబెళ్లూర్ నుంచి జడ్జర్ల వరకు 90 కి.మీ.ల ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణంపై కర్ణాటక ప్రభుత్వంతో కొంత వివాదం నెలకొనడంతో ఆ పనులు కూడా ముందుకు సాగడం లేదు. మరోవైపు, వీటితో పాటు కొత్తగా మరో 10 రోడ్ల పనులు ప్రారంభించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఏర్పాట్లు చేస్తోంది.
కీలకమైన హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంతో పాటు నాగ్‌పూర్ టు -విజయవాడ మధ్య కొత్తగా నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ కూడా ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు, నాగ్‌పూర్ టు విజయవాడ కారిడార్‌లో భాగంగా తెలంగాణ పరిధిలో మంచిర్యాల నుంచి వరంగల్, ఖమ్మం మీదుగా ఎపి సరిహద్దు వరకు 311 కి.మీ.ల మేర రోడ్డు నిర్మాణం వచ్చే ఏడాదిలోగా పూర్తి కానుంది. మరోవైపు, మంచిర్యాల టు -ఖమ్మం మీదుగా విజయవాడకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవేతో నాగపూర్ టు -విజయవాడ మధ్య దూరం 180 కి.మీ.ల మేర తగ్గనుంది. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా ట్రాఫిక్ చాలా వరకు ఈ కొత్త రోడ్డు మీదుగా డైవర్ట్ అవుతుంది. ఇది కొత్త ప్రాంతాల్లో పారిశ్రామిక పురోగతికి దోహదం చేయడమే కాకుండా దూరం తగ్గడంతో ఇంధనం సమయం ఆదా కానుంది